‘నై’రుతి! | formers waiting for rains | Sakshi
Sakshi News home page

‘నై’రుతి!

Published Sun, Jun 22 2014 11:36 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

‘నై’రుతి! - Sakshi

‘విత్తు’ అదను దాటుతోంది. చినుకు కోసం రైతులు ఆకాశం వైపు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని 38 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది.
 
 మిగిలిన మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటే పత్తి, పెసర, మినుము పంటల దిగుబడికి వాతావరణం అనుకూలించదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి స్థానంలో జొన్నలు, మొక్కజొన్నలు, సోయా చిక్కుడు విత్తనాలు వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో వ్యవసాయ పనులు జిల్లాలో ముమ్మరం కావాలి. కానీ ఇంతవరకు రుతువు జాడే లేదు. రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయని.. రెండు రోజుల్లో తెలంగాణకు తాకుతాయంటూ వాతావరణ శాఖ
 చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండా పోతోంది.
 
 ఓవైపు ఆకాశం మేఘావృతం అవుతున్నా ఎండ వేడిమి మాత్రం జిల్లాలో తగ్గడం లేదు. దీంతో జిల్లాలో దాదాపుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి పవనాలకంటే ముందే రైతులు దుక్కులను సిద్ధం చేసి పెట్టుకునేవారు. కానీ వర్షాల జాడ లేకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. వర్షాలు సకాలంలో కురిసినట్టయితే జిల్లాలో ఇప్పటికే సగం వరకు సాగు విస్తీర్ణంలో పత్తి సాగయ్యేది. ముందస్తుగా పలకరిస్తాయనుకున్న రుతుపవనాల వెనుకడుగుతో కాలం అవుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 సాధారణం కంటే తక్కువ వర్షపాతం
 జిల్లాలో ఈ నెలలో సగటు సాధారణ వర్ష పాతం 71.2 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు పడింది కేవలం 29.7 మి.మీ.మాత్రమే. దీంతో జిల్లాలో  అంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 7 మండలాల్లోనూ సాధారణ వర్షం పాతం కన్నా తక్కువగా వర్షపాతమే నమోదైంది. ఈ వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు జిల్లా అంతటా విస్తరిస్తేనే పంటలకు భవిష్యత్తు ఉంటుంది. జిల్లాలో 64 లక్షల హెక్టార్లను సాగుకు సిద్ధం చేసి ఉంచారు.
 దీనిలో 1.30 లక్షల హెక్టార్లలో వరి, 1.41 లక్షల హెక్టార్లలో పత్తి విత్తనాలతో పాటు మరో  లక్ష ఎకరాలలో పప్పు ధాన్యాలు విత్తేందుకు  రైతులు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం వర్షాలు కురిస్తే.. ఇప్పటికే తొలకరితో నేల తడిసిపోయి.. మలివర్షంతో నీళ్లు చెరువుల్లోకి పారాల్సి ఉంది. జూన్ మాసం మొదటి, రెండో వారాలు విత్తనాలు విత్తటానికి అత్యంత అనుకూలం. కానీ మూడో వారం దాటిపోతున్నా వర్షం జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
 
 ఎండుతున్న నీటి వనరులు..
 వర్షాలు లేకపోవడంతో జిల్లాలో చిన్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో గిరి పుత్రులు మంచినీటి కోసం మైళ్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పశువులకు కూడా తాగడానికి నీళ్లు దొరికేది కష్టమే.
 
 ఇప్పటికే  గొర్రెలకు మేత దొరకక గొర్రెల కాపర్లు వలస బాట పట్టారు. నైరుతి రుతు పవనాలు వెనుకడుగు వేస్తే ఈసారి రైతుల జీవన చిత్రం మారక తప్పదేమో.
 

Advertisement
 
Advertisement
 
Advertisement