ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు
సాక్షి, హైదరాబాద్: ఒకే కాన్పులో నలుగురు ఆడ పిల్లలకు జన్మనిచ్చిందో మహిళ. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన చంద్రశేఖర్ (35) సతీమణి నళిని (33) గర్భవతి. స్థానిక వైద్యులను సంప్రదించగా... ఆమె కడుపులో నలుగురు బిడ్డలున్నట్టు గుర్తించారు. వారి సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిని సంప్రదించారు. నగరంలోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్న నళినికి శుక్రవారం రాత్రి రక్తస్రావం కావడంతో బంధువులు ఆసుపత్రిలో చేర్చారు.
యశోద ఆసుపత్రి వైద్యులు భాగ్యలక్ష్మి, మాధవి సహా 15 మంది బృందం 32 వారాల గర్భిణికి శస్త్రచికిత్స చేసి శిశువులను బయటికి తీశారు. ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు జన్మించడం చాలా అరుదని, ప్రతి ఏడు లక్షల ప్రసవాల్లో ఒకరికే ఈ అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఒక్కో శిశువు 1.2 కేజీల బరువు ఉంది. ప్రస్తుతం వారిని నియోనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి కాన్పులోనే నలుగురు ఆడశిశువులు జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు నళిని భర్త చంద్రశేఖర్ చెప్పారు.