నలుగురు చిన్నారులను మింగిన కుంట
కందుకూరు: భారీ వర్షాలతో జలకళ సంతరించుకున్న కుంటను చూసేం దుకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ అనుబంధ గ్రామం మహ్మద్ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుత్పల భిక్షపతి, యాదమ్మ దంపతులకు గణేశ్, శివ, కుమార్తె శిల్ప ఉన్నారు. గణేశ్ డిగ్రీ చదువుతుండగా, శిల్ప(14), శివ (13) కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 9, 7 తరగతులు చదువుతున్నారు. వీరి తండ్రి భిక్షపతి ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లే కూలీనాలీ చేస్తూ పిల్లల్ని పోషించుకుంటోంది. భిక్షపతి చిన్నాన్న లక్ష్మయ్య కూతురు సుశీల, ఈశ్వర్ దంపతులకు సృజన్ (13), మదన్ కుమార్ అలియాస్ బన్నీ(10) ఉన్నారు.
కందుకూరు చౌరస్తాలోని ఎస్‌వీవీఆర్ స్కూల్‌లో వీరు 7, 6 తరగతులు చదువుతున్నారు. ఈశ్వర్ భార్యాపిల్లలను వదిలేసి చాలా ఏళ్ల క్రితమే ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సుశీల పుట్టింట్లోనే ఉంటూ కూలిపనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. గురువారం మధ్యాహ్నం శిల్ప, శివ, సృజన్ , మదన్ కుమార్‌తోపాటు గ్రామానికి చెందిన దశరథ కుమార్తెలు సంధ్య, సబిత, జంగయ్య కుమారుడు వంశీ కలసి గ్రామ సమీపంలో ఉన్న పోరుడోని కుంటలోకి వర్షానికి చేరిన నీటిని చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలో మట్టి అంటడంతో కాళ్లు కడుక్కుందామని కుంట వద్దకు వెళ్లగా.. ఇంటర్ చదివే సంధ్య వారిని వారించి పైకి రావాలని చెప్పింది.
దీంతో ఆమె చెల్లెలు సబిత, వంశీ కట్టపైకి వచ్చారు. మిగతా నలుగురు శిల్ప, శివ, సృజన్ , మదన్ కుమార్ కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. దీంతో పైన ఉన్న ముగ్గురు గ్రామంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం తెలిపారు. అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో చిన్నారులను గాలించి బయటికి తీయగా అప్పటికే అందరూ విగతజీవులుగా కనిపించారు.