వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లాలోని మునగాల,
వలిగొండ
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లాలోని మునగాల, వలిగొండ విశాఖ పట్టణం జిల్లా పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. ప్రకాశం జిల్లా దర్శీ ప్రాంతానికి చెందిన బండారి వెంకటేశ్వర్లు(50) వలిగొండ ప్రాంతంలో ధాన్యపుబస్తాలను అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బస్తాల సేకరణలో భాగంగా శనివారం తనమోపెడ్‌పై నాగారం నుంచి కమ్మగూడెం వైపు వెళ్తుండగా కల్వర్టు సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. పోష్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.
లారీని వెనుక నుంచి ఢీకొని..
మాధవరం(మునగాల): కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న ఇన్నోవా కారు మార్గమధ్యలో మాధవరం శివారులో ముందుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నానికి చెందిన దేశిని శ్రీకాంత్(33)తో పాటు కృష్ణాజిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడు ఉయ్యూరి ముఖేష్‌గౌడ్, ఉయ్యూరి సూరిబాబు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కారుడ్రైవర్ మాదావత్ నవీన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని జాతీయ రహదారి వాహనం 1033లో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దేశిని శ్రీకాంత్ మృతిచెం దాడు. కాగా మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని హైదరాబాద్‌లోని నిమ్స్, మరొకరిని ఎల్‌బీనగర్‌లో గల కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఇన్‌చార్జి జి.చినమల్సూర్ తెలిపారు. దేశిని శ్రీకాంత్ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
రెండు బస్సులు ఢీ పలువురికి స్వల్పగాయాలు
మండలంలోని మాధవరం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను పునఃరుద్ధరిస్తున్న సమయంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు స్టేషన్ ఇన్‌చార్జి జి.చినమల్సూర్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులలో ఉన్న పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని మునగాల పోలీసులు 108వాహనంలో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బైక్‌పై నుంచి పడి మహిళ..
మునగపాక (విశాఖ జిల్లా) : రాంబిల్లి మండలం వాడపాలెం గ్రామానికి చెందిన కుడా లక్ష్మి(29) తన భర్తతో కలిసి నాగార్జునసాగర్‌లో ఉంటోంది. ఆమె ఇటీవల తన పుట్టింటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో శనివారం ఉదయం తన అన్నయ్య గరికిని తాతారావుతో కలిసి బైక్‌పై అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బైక్ గోతిని తప్పించే క్రమంలో కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి అప్పటికే మృతి చెందిన ట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద బోరున విలపించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
వట్టిమర్తి (చిట్యాల) : హైదరాబాదుకు చెందిన దామెర భానుమూర్తి (51) తన కుటుంబ సభ్యులతో శుక్రవారం కారులో నర్సారావుపేట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాదుకు వస్తూ వట్టిమర్తి స్టేజీ సమీపంలో కారు ఆపుకుని మూత్ర విసర్జనం కోసం దిగి వెళుతుండా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్ర గాయాలైన భానుమూర్తిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ యాదగిరి పేర్కొన్నారు.