ఇక ఆంక్షల్లేని ఉచిత కరెంట్!
విద్యుత్ కనెక్షన్ల సంఖ్య, పొలం విస్తీర్ణంపై నిబంధనలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: పెద్ద, చిన్న రైతులు తేడా లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. అవసరమై నన్ని ఉచిత కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయిం చాయి. ఈ మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేయాలం టూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుతం.. మెట్ట భూమి రైతులకు మూడుకు మించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని, 2.5 ఎకరాల్లోపు మాగాణి ఉన్న రైతులే ఉచిత విద్యుత్‌కు అర్హులనే నిబంధ నలున్నాయి.
ఇకపై మెట్ట, మాగాణి భూముల రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా విద్యుత్ కనెక్షన్లు జారీ చేసేందుకు... విద్యుత్ కనెక్షన్ల సంఖ్య, భూవిస్తీర్ణం ఆంక్షలను ఎత్తివేయాలని డిస్కంలు కోరాయి. అయితే కార్పొరేట్ రైతులు ఉచిత విద్యుత్‌కు అనర్హులన్న నిబంధనలో మార్పు ఉండదని పేర్కొన్నాయి. ఇక పాలీహౌస్/గ్రీన్‌హౌస్‌లలో పంటల సాగుకు సైతం ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలంటూ మరో ముఖ్య ప్రతిపాదన చేశాయి.
చార్జీల పెంపు లేనట్లే!
రాష్ట్రంలో గతేడాది (2016–17)లో అమలు చేసిన విద్యుత్ చార్జీలనే ఈ ఏడాది (2017–18) కూడా కొనసాగించాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయి. ఈ మేరకు డిస్కంల తరఫున దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ఏడాది విద్యుత్ చార్జీలు పెంచబోమని శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా డిస్కంలు ఈ ప్రతిపాదన చేశాయి. గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక తదితర అన్ని కేటగిరీల వినియోగదారులకు ఎలాంటి చార్జీల పెంపును ప్రతిపాదించలేదని రఘుమారెడ్డి తెలిపారు.
ఇక ప్రస్తుతం మూడు కన్నా ఎక్కువ విద్యుత్ కనెక్షన్లున్న మెట్ట రైతులు.. అదనపు కనెక్షన్లకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి వస్తోందని, 2.5 ఎకరాలకు మించి మాగాణి ఉన్న రైతులు కూడా బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఇకపై ఎంత భూమి ఉన్నా, ఎన్ని విద్యుత్ కనెక్షన్లకు అయినా ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని ప్రతిపాదించామని వెల్లడించారు. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యథాతథంగా అమలు చేస్తే డిస్కంలు ఎదుర్కునే ఆర్థిక లోటుపై ఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుందని... లోటును అధిగమించేం దుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈఆర్సీ నిర్ణయం ఎలా ఉంటుందో?
విద్యుత్ చార్జీలు పెంచవద్దని డిస్కంలు ప్రతిపాదించినా నిర్ణయాధికారం మాత్రం ఈఆర్సీ చేతిలో ఉంది. వాస్తవానికి గతేడాది నవంబర్‌లోగా సమర్పించాల్సిన టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పుడు సమర్పించాయి. జాప్యంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన ఈఆర్సీ.. సుమోటోగా కొత్త టారిఫ్ ఖరారు ప్రక్రియను చేపట్టింది.
డిస్కంల ఆర్థిక స్థితి, ప్రభుత్వం అందించే విద్యుత్ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుని.. విద్యుత్ చార్జీలు పెంచాలా.. వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. చార్జీల పెంపు వద్దన్న డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తే.. ఏయే కేటగిరీల వినియోగదారులకు ఎంత పెంచాలన్న అంశా న్ని ఈఆర్సీయే ఖరారు చేయనుంది.