భైంసా మండలం కామోల్‌లో తలపడుతున్న మల్లయోధులు (ఫైల్)
కుభీర్(ముథోల్): జిల్లావ్యాప్తంగా కుస్తీపోటీలకు ఆదరణ పెరుగుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లో జరిగే జాతర్లలో కుస్తీపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పోటీల్లో తెలంగాణతోపాటు మహారాష్ట్రలోని పలు గ్రామాల మల్లయోధులు పాల్గొంటున్నారు. దీంతో రెండు రాష్ట్రాల క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతున్నాయి. జాతర్లలో పోటీలు నిర్వహిస్తున్న ఆయా గ్రామ కమిటీలు విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు.
పెరుగుతున్న గ్రామాల సంఖ్య..
ప్రతీ సంవత్సరం కుస్తీపోటీలు నిర్వహించే గ్రామాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కుభీర్ మండలంలోని పార్డి(బి), రంజిని, డొడర్న, కుభీర్, తానూరు మండలంలోని మొగ్లి, బోరిగాం, తానూరు, ఏల్వీ, ముథోల్ మండలంలోని ముథోల్, ఎడ్‌బిడ్, కుంటాల మండలంలోని సూర్యాపూర్, ఓల, కుంటాల, భైంసా మండలంలోని కామోల్, మహాగాం, సారంగాపూర్ మండలంలో చించోలి(బి) గ్రామాల్లో కుస్తీపోటీలు సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
జాతర్ల సందర్భంగా..
కుస్తీ పోటీలు ఉగాది, శ్రీరామనవమి, శివరాత్రి, హనుమాన్ జయంతి తదితర పండుగల సందర్భాల్లో ఆయా గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో జిల్లాలోని దార్‌కుభీర్, కుప్టి, కస్ర, రాజురా, జాంగాం, సూర్యాపూర్, కుంటాల, బోరిగాం, మహారాష్ట్రలోని నాందేడ్, హిమాయత్‌నగర్, సిరంజని, బిద్రెల్లి, కోస్మిట్ తదితర గ్రామాలకు చెందిన మల్లయోధులు పాల్గొంటున్నారు. కుభీర్ మండలంలోని దార్‌కుభీర్ మల్లయోధుల గ్రామంగా ప్రసిద్ధిచెందింది. ఈ గ్రామంలో అందరూ చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ వ్యాయామం చేస్తారు. ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా తప్పనిసరిగా పాల్గొంటారు. ఇక్కడ తరతరాలుగా కుస్తీ వస్తాదులు తయారవుతూనే ఉన్నారు. ప్రస్తుతం పేరుగాంచిన మల్లయోధులు నాగేశ్, హన్మంతు, శేషారావు, గణపతి, గణేశ్ తదితరులు ఈ గ్రామంలో ఉన్నారు. నాగేశ్, గణపతి ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం మల్లయోధులకు ప్రోత్సాహాన్ని అందించి కోచ్‌ల ద్వారా శిక్షణ ఇప్పిస్తే మరింత మంది మల్లయోధులు తయారయ్యే అవకాశాలున్నాయి.
మా తండ్రే నాకు ఆదర్శం
మా కుటుంబంలో మానాన్న, మా పెద్దనాన్న కుస్తీ పట్టేవారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని నేనూ నేర్చుకున్న. ప్రభుత్వం నిర్వహించే రెజ్లింగ్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో పాల్గొన్న. వ్యాయామం చేస్తూ కండపుష్టిని పెంచుకుంటున్నం.– నాగేశ్, మల్లయోధుడు, దార్‌కుభీర్
మా ఇంట్లో అంతా వస్తాదులే
మా కుటుంబంలో అంతా వస్తాదులే. మా తాతతోపాటు మా నాన్న, పెద్దనాన్న, మేము నలు గురు అన్నదమ్ములం అందరు మల్లయోధులమే. అందరం పోటీల్లో పాల్గొంటాం. ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న అన్ని పోటీల్లో పాల్గొంటున్నాం.– శేషారావు, మల్లయోధుడు, కుభీర్
Comments
Please login to add a commentAdd a comment