
మీది అత్యుత్సాహం
► నర్సరీ నుంచే అడ్మిషన్లు ఎందుకు తీసుకున్నారు?
► నిబంధనలు మార్చలేదు.. టీచర్లు లేరు.. పుస్తకాల్లేవు
► ఇంగ్లిష్ మీడియం బోధించడం ఎట్లా సాధ్యం?
► జిల్లా విద్యాశాఖ సమీక్షలో డీఈవోపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
► మంచి ఉద్దేశ ంతో కలెక్టరే జీవో ఇచ్చారన్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
► అయితే కలెక్టరే బాధ్యత తీసుకోవాలన్న కడియం
► కలెక్టర్ ఫండ్ నుంచి పుస్తకాలు కొనాలని సూచన
► పాఠశాలల్లో వసతుల కల్పనకు రెండు దశల్లో రూ.130 కోట్ల విడుదలకు హామీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సర్కారు పాఠశాలల్లో నర్సరీ నుంచి ఆంగ్లమాధ్యమం బోధిస్తామంటూ విద్యార్థులను చేర్చుకోవడంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ డీఈవోపై మండిపడ్డారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో బడిబాటకు అనూహ్య స్పందన వచ్చిందని, ఇతర జిల్లాలతో పోలిస్తే కరీంనగర్‌లోనే అధిక సంఖ్యలో విద్యార్థులు చేరారని డీఈవో శ్రీనివాసాచారి తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో న ర్సరీ నుంచి పిల్లలను చేర్చుకున్నారని, వాళ్ల ప రిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కడియం శ్రీహరి నర్సరీ నుంచి ఎందుకు దరఖాస్తులు స్వీకరించారని ప్రశ్నించారు. ‘మేం ఈ ఏడాది ఒకటో తరగతికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం పరిమితం చే స్తూ అడ్మిషన్లు తీసుకోవాలని చెప్పాం. కొందరు డీఈవోలు అత్యుత్సాహం ప్రదర్శించి నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఆంగ్లంలో బోధిస్తామంటూ విద్యార్థులను చేర్చుకున్నారు. వాస్తవానికి ఐదేళ్లు నిండిన పిల్లలను మాత్రమే పాఠశాలల్లో చేర్చుకోవాలని కేంద్ర, రాష్ర ప్రభుత్వాల నిబంధులు చెబుతున్నాయి. ఆ నిబంధనలను మార్చకుండా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలో విద్యాబోధన ఎట్లా సాధ్యం? పైగాా ఇంగ్లిష్‌లో బోధించే టీచర్లు లేరు.
ఉన్న వారికి శిక్షణ ఇవ్వలేదు. ఇప్పటివరకు కరిక్యులమ్ కూడా తయారు కాలేదు. పుస్తకాలు లేవు. అట్లాంటప్పుడు నర్సరీ నుంచి పిల్లలను ఎట్లా చేర్చుకున్నారు’ అని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ తల్లిదండ్రులంతా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని కోరుకుంటున్న నేపథ్యంలో మంచి ఉద్దేశంతో కలెక్టర్ జీవో ఇచ్చారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. జిల్లావ్యాప్తంగా 15 వేలకుపైగా విద్యార్థులు చేరారని, వారి పరిస్థితి ఏమిటని అడిగారు. వెంటనే కడియం స్పందిస్తూ ‘విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించి అంగన్‌వాడీల ద్వారా ప్రీప్రైమరీ విద్య అందించొచ్చు. అంగన్‌వాడీలన్నీ కలెక్టర్ పరిధిలోనే ఉంటారుు కాబట్టి ఆ బాధ్యతను కలెక్టరే తీసుకోవాలి’ అన్నారు.
పుస్తకాలే లేనప్పుడు చదువెట్లా చెబుతారని జీవన్‌రెడ్డి ప్రస్తావించగా మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ‘ఈ ఏడాది వరకు ప్రైవేటు స్కూళ్లలో అమలవుతున్న సిలబస్‌ను బోధించండి. అందుకోసం ఆయా పుస్తకాలను కొనుగోలు చేస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే కరిక్యులమ్ రూపొందిస్తుంది కాబట్టి సమస్య ఉండదు’ అని సూచించారు. ఆయా పుస్తకాలకయ్యే ఖర్చును కలెక్టర్ నిధి నుంచి చెల్లించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అందుకు అంగీకరించిన కలెక్టర్ నీతూప్రసాద్ రూ.10 లక్షల వరకు పుస్తకాల కొనుగోలుకు చెల్లిస్తానని పేర్కొన్నారు.
సర్కారు బడుల్లో సౌకర్యాలకు రూ.130 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మౌలిక సదుపాయల కొరత తీవ్రంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ సమకూర్చాలంటే రూ.239 కోట్లు అవసరమని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి, కలెక్టర్ సహకరిస్తే ఆ సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. ‘పాఠశాలల్లో ఏయే సమస్యలున్నాయో నియోజకవర్గాల వారీగా అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతారు. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో రూ.5 కోట్లు ఖర్చు చేద్దాం. అందుకు ఎమ్మెల్యే నిధి నుంచి రూ.కోటి ఇవ్వండి. కలెక్టర్, మంత్రి కోటా నుంచి మరో రూ.కోటి ఇవ్వండి. మిగిలిన రూ.3 కోట్లు విద్యాశాఖ సమకూరుస్తుంది. మీరు ఎంత తొందరగా ప్రతిపాదనలు పంపితే అంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తా’ అని ప్రతిపాదించారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ ‘నియోజకవర్గానికి రూ.5 కోట్లు కాదు, రూ.10 కోట్లు ఖర్చు చేద్దాం. రెండేళ్లలో అన్ని పాఠశాలల్లో సౌకర్యాలన్నీ కల్పిద్దాం.
అందుకోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులమంతా కలిసి నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున 13 నియోజకవర్గాలకు రూ.39 కోట్లు ఇస్తాం. మీ శాఖ నుంచి నియోజకవర్గానికి రూ.7 కోట్ల చొప్పున రూ.91 కోట్లు ఇవ్వండి’ అని సూచించారు. ఇందుకు ఎమ్మెల్యేలంతా అంగీకరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈటల సూచనను కడియం సైతం స్వాగతించారు. ‘విద్యాశాఖ ఒకేసారి రూ.7 కోట్లు చెల్లించాలంటే కాస్త ఇబ్బంది. రెండు దశల్లో ఆ మెత్తాన్ని చెల్లిస్తాం’ అని హామీ ఇచ్చారు.
కాలేజీల్లో ఫర్నీచర్‌కు రూ.15 కోట్లు : మంత్రి ఈటల రాజేందర్
జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఫర్నీచర్‌ను సమకూర్చేందుకు రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈటల మాట్లాడుతూ విద్యాశాఖ మంజూరు చేసే నిధులకు అదనంగా మరో రూ.25 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల శిథిలావస్థలో ఉన్నందున కొత్త భవనాలు నిర్మించాలని, ఎస్సారార్ కళాశాల ఆడిటోరియం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రతిపాదనకు కడియం సానుకూలంగా స్పందించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. పాఠ శాల ల్లో పార్ట్‌టైం స్వీపర్ల సమస్య వేధిస్తోందని, వెంటనే పరిష్కరించాలని జీవన్‌రెడ్డి సూచించగా ఆర్థిక శాఖ వద్ద ఫైలు ఉందని, త్వరలో పరిష్కరిస్తామని ఈటల పేర్కొన్నారు.
ఈసారి ఎన్‌రోల్‌మెంట్ పెంచుతాం : డీఈవో హామీ
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పడిపోతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో పెరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గత ఏడాది విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పడిపోతే ఉపాధ్యాయ పోస్టులు పోతాయనే భయంతోనే కాకిలెక్కలతో ఎన్‌రోల్‌మెంట్ సంఖ్యను పెంచి చూపారని అన్నారు. ఈసారి వాస్తవిక సంఖ్య బయటకు వస్తోందన్నారు. దీనిపై డీఈవో స్పందిస్తూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం తనిఖీలు చేస్తేనే సరైన ఫలితాలొస్తాయని, ఈ విషయంలో కలెక్టర్, అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు సైతం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలను సందర్శించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు పుట్ట మధు, బొడిగె శోభ, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాణీప్రసాద్, ఇంటర్మీడియట్ కమిషనర్ అశోక్, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోరుట్ల పాలిటెక్నిక్‌లో రూ.5.80కోట్లతో బాలుర వసతిగ ృహం, సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. బాలికల జూనియర్ కళాశాలలో రూ.81 లక్షలతో అదనపు తరగతి గదులు, బాలుర జూనియర్ కళాశాలలో రూ.98లక్షలతో ల్యాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కోరుట్ల జూనియర్ కళాశాలకు రెండంతస్థుల భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరుకు హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్‌లో బాలికల వసతిగృహం కోసం ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రూ.2.42 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మెట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను సందర్శించారు. కళాశాలలకు ఆధునిక భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళశాలను ప్రారంభించారు. ఓ తరగతి గదిలో విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలు ఉండటం చూసి ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.