అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) జిల్లా 8వ మహాసభలకు సత్తుపల్లి ముస్తాబైంది...
సత్తుపల్లి టౌన్: అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) జిల్లా 8వ మహాసభలకు సత్తుపల్లి ముస్తాబైంది. సత్తుపల్లిలోని బాటన్న నగర్(మాధురి ఏసీ ఫంక్షన్‌హాల్)లో ఈ నెల 17, 18వ తేదీలలో మహాసభల నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. అరుణ తోరణాలు.. జెండాలతో ప్రధాన వీధులను అలంకరించారు. ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి 500 మందికిపైగా రైతు, కూలీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రతినిధుల సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు, ప్రారంభోపవ్యాసం చేస్తారని న్యూడెమోక్రసీ నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరౌతారన్నారు.
ఉద్యమనేతల రాక
రైతు కూలీ సంఘం మహాసభలు, బహిరంగ సభల్లో పాల్గొనేందుకు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డివి కృష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ, పీఓ డబ్ల్యూయూ ఏపీ అధ్యక్షులు కె.రమ, జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ముద్దా భిక్షం,జగన్న తదితర ఉద్యమనేతలు సత్తుపల్లికి రానున్నారు.
భారీ ప్రదర్శన
ఏఐకేఎంఎస్ జిల్లా 8వ మహాసభలు విజయవంతం కోరుతూ ప్రజా సంఘాలు, వలంటీర్ల ఆధ్వర్యంలో గురువారం సత్తుపల్లిలో నిర్వహించిన రెడ్‌షర్ట్ ప్రద్శన ఆకట్టుకుంది. అరుణోదయ కళాకారులు డప్పు డ్యాన్సులు చేస్తూ కవాతు నిర్వహించారు. స్థానిక నీలం రామచంద్రయ్య భవనం నుంచి పాత సెంటర్ మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు వందలాది మంది పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్, అరుణోదయ సంస్కృతిక సమాఖ్య కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని ప్రదర్శన చేశారు.
ఈ ర్యాలీలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గన్న, జిల్లా పౌరహక్కుల సంఘం అధ్యక్షులు కె.రవి, జి.లలిత, ఎ.రాము, ఎ.శరత్, కె.సంధ్య, పరిమల, కోటమ్మ, నిమ్మల రాంబాబు, ముత్యాలరావు, సోయం రాంబాబు, జి.ఉదయ్‌రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.