పెట్రోల్ బంకుల్లో ఇంధన దోపిడీ | Fuel robbery IN Petrol filling station | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంకుల్లో ఇం‘ధన’ దోపిడీ

Published Tue, Jul 15 2014 4:36 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

పెట్రోల్ బంకుల్లో ఇంధన దోపిడీ - Sakshi

పెట్రోల్ బంకుల్లో ఇంధన దోపిడీ

 అటు కల్తీ.. ఇటు కోత
- వినియోగదారుడు లూటీ
- ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో మోసాలు
- ఫిర్యాదు వస్తేనే స్పందిస్తున్న అధికారులు
- నామమాత్రంగా తనిఖీలు
- అపరాధ రుసుముతో సరి..

 పోచమ్మమైదాన్ : పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కల్తీతోపాటు మీటర్ రీడింగ్‌లో జంపింగ్ (కొలతల్లో మోసం)లకు పాల్పడుతూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో 210 వరకు పెట్రోల్ బంకులు ఉన్నారు. చాలావరకు బంకుల్లో ఇంధనం కల్తీ అవుతున్నట్లు ఫిర్యాదులుఅందగా.. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన ఘటనలు కోకొల్లలు. జిల్లాలోని పలు బంకుల్లో పరీక్షలకు అందని స్థారులో కల్తీ జరుగుతున్నట్లు సమాచారం.

ఇది చాలదన్నట్లు బంకుల నిర్వాహకులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కొలతల్లో మోసాలకు పాల్పడుతుండడం వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. హన్మకొండ అదాలత్ సమీపంలోని కీర్తి ఫిల్లింగ్ స్టేషన్‌లో సోమవారం మోసాల తంతు బట్టయలైన తీరు... జిల్లాలోని బంకుల్లో సాగుతున్న అక్రమ దందాకు నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా ఇంధనం రూపేణా పెట్రోల్, డీజిల్ వినియోగదారుల జేబులకు నిత్యం రూ.లక్షల్లో చిల్లు పడుతోంది.
 
అధికారుల నిర్లక్ష్యంతోనే...
వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందితే గానీ.. అధికారులు కదలరనే అపవాదు తూనికలు, కొలతల శాఖపై ఉంది. ఇంధన కల్తీ.. రీడింగ్ జంపింగ్‌కు సంబంధించి తూతూమంత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పంథిని, తొర్రూర్, ఫోర్ట్ రోడ్‌లలోని పలు బంకుల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిర్వాహకుల మోసాలు బట్టబయలయ్యూరు. ఓ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఐదు లీటర్ల పెట్రోల్‌కు 130 మిల్లీ లీటర్లు, మరో బంక్‌లో ఐదు లీటర్ల పెట్రోల్‌కు 50 మిల్లీ లీటర్ల పెట్రోల్ తక్కువగా వచ్చినట్లు తేలింది.

ఈ మేరకు అధికారులు తక్కువగా వచ్చిన ఫిల్లింగ్ పాయింట్ల (యంత్రాలు)ను మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఆయూ బంకుల్లోని మిగతా ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా పెట్రో ఉత్పత్తుల విక్రయూలు కొనసాగుతుండగా... అపరాధ రుసుం చెల్లించడంతో మూతబడినవి కొన్ని రోజుల తర్వాత తెరుచుకోవడం పరిపాటిగా మారింది. దీంతో బంకుల నిర్వాహకుల్లో భయం లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మోసాలు బయటపడితే సదరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేయడమే కాకుండా సంబంధిత వస్తువులను సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలి. కానీ.. తూనికలు, కొలతల శాఖ అధికారులు అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు జిల్లాలో ఎక్కడా లేవు.
 
కొలతల్లో మోసాలు ఇలా...
- పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలే ఫిల్లింగ్ యంత్రాలను సరఫరా చేస్తాయి. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ యంత్రాల్లో మార్పు చేర్పులతోపాటు రిమోట్ ద్వారా ఆపరేట్ వెసులుబాటు కల్పించాయి. దీన్ని అసరా చేసుకున్న ఫిల్లింగ్ స్టేషన్ల యజమాన్యాలు యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్ రీడింగ్‌లో జంపింగ్‌కు పాల్పడుతున్నాయి.
- కొన్ని కంపెనీలకు సంబంధించి ఫిల్లింగ్ యంత్రాలకు రిమోట్ వెసులుబాటు లేదు. అయినా.... పలు బంకుల నిర్వాహకులు పంపింగ్ యం త్రాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అమర్చి కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు.
- భారీ క్యూ ఉండే పెట్రోల్ పంపుల్లో జీ రీడింగ్ చేయకుండానే (డబ్బులు ఫీడ్ కానీ... లీటర్లు అని) పంపింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన కంటే ముందు బైక్ వ్యక్తి ఎంత పెట్రోల్ పోసుకుంటే... అతడి వెనుక వాహనానికి అంత తక్కువగా వస్తుంది.
 
 కల్తీ.. ఇలా గుర్తుపట్టొచ్చు..
- ఇంధన పరీక్షకు సంబంధించి ప్రతి పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ ఉండాలి. చతురస్ర ఆకారంలో ఉండే ఫిల్టర్ పేపర్‌పై రెండు చుక్కల పెట్రోల్‌ను పోయూలి. రెండు నిమిషాల తర్వాత అవి నల్లగా మారితే కల్తీ జరిగినట్లే.
- పెట్రోల్ పంపుల్లో  హైడ్రోమీటర్, థర్మామీటర్ తప్పనిసరిగా ఉండాలని ఆయిల్ కంపెనీ మార్కెటింగ్ గైడ్‌లైన్స్‌లో ఉంది. పెట్రోల్ లేదా డీజిల్‌లో హైడ్రోమీటర్, థర్మామీటర్ పెట్టాలి. హైడ్రోమీటర్ ద్వారా రీడింగ్... థర్మామీటర్ ద్వారా టెంపరేచర్(ఉష్ణోగ్రత)ను చెక్ చేయాలి. గతంలో కంపెనీ వారు పంప్ దగ్గర ఉన్న బుక్‌లో నమోదు చేసిన రీడింగ్‌ను పరిశీలించాలి. ఈ రీడింగ్‌లో 3 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే కల్తీ జరిగినట్లుగా నిర్ధారించవచ్చు.
 
కొలతల్లో ఇలా...
- పెట్రోల్ పంప్ వద్ద బీఎస్‌ఐ గుర్తించిన ఐదు లీటర్ల కొలత పాత్రలు ఉండాలి. కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ఇంధనం వచ్చినట్లు అనుమానం కలిగితే... వెంటనే ఆ పాత్రలో పోసి కొలిచి చూడవచ్చు.
- కల్తీ జరిగిందని గానీ... కొలతలో తేడా వచ్చిందని గానీ తేలితే పోలీస్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, తూనికలు, కొలతల శాఖ, సివిల్ సప్లయీస్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. మూడుసార్లు ఇలాంటి ఫిర్యాదులు అంది...  పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు తెలితే ఆయూ బంకులను సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంది.
 
97016 06633కు ఫోన్ చేయండి
ఏ బంకుల్లోనైనా కల్తీగానీ.. కొలతల్లో మోసం గానీ జరిగితే ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వండి. వెంటనే అక్కడ వాలుతాం. ఫిర్యాదులు అందిన బంకుల్లో వెంటవెంటనే తనిఖీలు చేస్తున్నాం. మీటర్ రీడింగ్ మోసాలకు పాల్పడిన బంకుల యజమానులపై కేసులు సైతం పెడుతున్నాం.
 - రామ్‌కుమార్, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కమిషనర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement