రైల్వే లైన్ల సర్వేకు నిధులు
మిర్యాలగూడ నుంచి జగ్గయ్యపేట లైన్ సర్వేకు రూ.9.88 లక్షలు
మిర్యాలగూడ నుంచి డోర్నకల్ లైన్ సర్వేకు రూ.14.50 లక్షలు
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి సూర్యాపేట లైన్ సర్వేకు రూ.25.45 లక్షలు
ప్రాజెక్టులకు నిధులు
మాచర్ల నుంచి నల్లగొండ లైన్ నిర్మాణానికి రూ. కోటి
విష్టుపురం నుంచి జాన్‌పహాడ్ లైన్‌కు రూ.5 కోట్లు
జగ్గయ్యపేట నుంచి మేళ్లచెర్వుకు రూ.100 కోట్లు
మేళ్లచెర్వు నుంచి జాన్‌పహాడ్ లైన్ నిర్మాణానికి రూ.100 కోట్లు
నల్లగొండ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు కొంత ఊరట లభించింది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు చేయలేదు. కానీ జిల్లాలో కొత్త రైల్వే లైన్‌ల నిర్మాణానికి సర్వే చేసేందుకు గాను నిధులు మంజూరు చేసింది. అదే విధంగా ఇప్పటికే జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా విష్ణుపురం నుంచి జగ్గయ్యపేట రైలు మార్గానికి మూడు విభాగాల్లో నిధులు మంజూరు చేసింది.
దీంట్లో విష్ణుపురం నుంచి జాన్‌పహాడ్ రైలు మార్గానికి రూ.5 కోట్లు, జాన్‌పహాడ్ నుంచి మేళ్లచెర్వుకు రూ.100 కోట్లు, మేళ్లచెర్వు నుంచి జగ్గయ్యపేట రైలు మార్గానికి రూ.100 కోట్లు కేటాయించారు. మొత్తం జగ్గయ్యపేట నుంచి జాన్‌పహాడ్ వరకు రైలు మార్గం పనులు ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే నల్లగొండ నుంచి మాచర్ల వరకు ప్రతిపాదించిన రైలు మర్గానికి కేవలం కోటి రూపాయలు మాత్రమే కేటాయించడం పట్ల జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2013-14 బడ్జెట్‌లో రైల్వే లైన్ నిర్మాణం కోసం నిధులు కే టాయించినట్లు చెప్పారు. కానీ కేంద్రంలో ప్రభుత్వం మారింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే నాగార్జునసాగర్ అభివృద్ధి చెందేది.
సర్వేలకు నిధులు ...
మిర్యాలగూడెం నుంచి జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వే లైన్‌లు సర్వే చేసేందుకు రూ.9.88 లక్షలు, మిర్యాలగూడ నుంచి వరంగల్ జిల్లా డోర్నకల్ వరకు రూ.14.50 లక్షలు, సూర్యా పేట నుంచి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు 170 కి.మీ మేర రైల్వే లైన్ సర్వే చేసేందుకు రూ.25.45 లక్షలు కేటాయించారు.
అటకెక్కిన పెద్ద ప్రాజెక్టులు..
జిల్లా ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతాయనుకున్న సికింద్రాబాద్- భువనగిరి ఎంఎంటీఎస్ రైలు పొడిగింపు ఊసే కన్పించలేదు. పైగా రైళ్ల రద్దీని తగ్గించుకునేందుకు ఉద్దేశించిన సికింద్రాబాద్- భువనగిరి మూడో రైల్వే లైన్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. మూడో లైన్ సర్వేకోసం నాలుగేళ్ల కింద 50కోట్లు కేటాయించారు. కానీ ఈ సారి దాని ఊసే లేదు. బీబీనగర్- నడికుడి మార్గంలో డ బ్లింగ్, విద్యుదీకరణ పనుల గురించి ప్రస్తావించలేదు. కొత్త ప్యాసింజర్ రైలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ప్రయాణికుల్లో దాగి ఉంది. భువనగిరి-ఫలక్‌నుమా ప్యాసింజర్ రైలు జనగామ వరకు పొడిగింపు పూర్తి స్థాయిలో జరగలేదు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్య కోరినట్లుగా కాచిగూడ వయా సూర్యాపేట విజయవాడ నూతన రైలు మార్గం గురించి ప్రస్తావన రాలేదు. పలు రైళ్లను నిలపాలని ఆయన కోరినా ఫలితం లేదు.
భువనగిరి రైల్వే స్టేషన్‌లో వైఫై సౌకర్యం
వైఫై సౌకర్యం జిల్లాలోని నల్లగొండ, భువనగిరి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులోకిరానుంది. ఏ గ్రేడ్, బీగ్రేడ్ రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది.
మొండి చెయ్యి చూపారు
రైల్వే బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపింది. డబుల్ లైన్లు, విస్తరణ, కొత్త సర్వీస్‌లు ప్రారంభిస్తారనే ఆశలు అడియాసలయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీట వేసిన కేంద్రం, దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపినట్టు అయ్యింది. స్వచ్ఛభారత్, క్లీన్ అండ్ గ్రీన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. సరుకు రవాణా చార్జీలు పెంచడం వల్ల పరోక్షంగా అన్ని రకాల వస్తువులపై ధరల ప్రభావం ఉంటుంది. రైల్వే బడ్జెట్ ఆశాజనకంగా లేదు.
- బండా నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
నిరాశాజనకంగా ఉన్న బడ్జెట్ ఇది
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చేయూతనందిస్తూ తగిన ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేటాయింపులు జరపాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అంతేగాక జిల్లాలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే పనులకు తగిన నిధులు కేటాయించి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ప్రతిపాదనలను పక్కకు పెట్టడం నిరాశకు గురి చేసింది. అదేవిధంగా కనీసం ఒక్క నూతన ప్రాజెక్ట్‌కు కూడా నిధులు మంజూరు చేయకపోవడం అన్యాయం. విష్ణుపురం- జాన్‌పహాడ్ రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం మాత్రమే ఆశాజనకంగా ఉంది.
- ఐల వెంకన్నగౌడ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రజా వ్యతిరేక బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం కేవలం పారిశ్రామికవేత్తలకు పెద్దకొడుకుగా వ్యవహరిస్తోంది. మోదీ దేశానికి, రాష్ట్రానికి చేసింది నామమాత్రం. స్వచ్ఛభారత్ పేరుతో ప్రజలందరినీ రోడ్ల మీదకు నె ట్టేసి సంక్షేమ పథకాల అమలను పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జె ట్ ఆశాజనకంగా లేదు. మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్.
- బూడిద భిక్షమయ్యగౌడ్, డీసీసీ అధ్యక్షుడు
ప్రతి సారి అన్యాయమే
రైల్వే బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. నామమాత్రంగా పెట్టిన నిధులను కూడా విడుదల చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. బడ్జెట్‌లో కొత్తప్రాజెక్టుల ప్రస్తావనే లేకుండా పోయింది. జిల్లాకు నిధులను రాబట్టడంలో ప్రజాప్రతినిధులు విఫలం చెందారు.
-మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి
జిల్లా ప్రాజెక్టుల కోసం పోరాటం ఆగదు
రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొత్తగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. పీపీఏల ద్వారా ప్రాజెక్టులు చేపడుతామని చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు నిధులను సమకూర్చుకోలేకపోవడం నిరాశాజనకం. బడ్జెట్‌లో రూ. 8.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పలేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని రాజీలేని పోరాటం చేస్తాం. భువనగిరి వరకు మూడో లైను, ఎంఎంటీఎస్, రాయగిరి స్టేషన్‌ను యాదగిరిగా మార్పుకోసం ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం.
- బూరనర్సయ్యగౌడ్ ,భువనగిరి ఎంపీ
బడ్జెట్‌లో గుండు సున్నా
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణతో పాటు జిల్లాకు గుండు సున్నా పెట్టింది. పెట్టుబడిదారులకు కొమ్ముకాసే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. పేదలపై భారంమోపే విధంగా ఉంది. బడ్జెట్‌వల్ల పేదలకు ఒరిగేది ఏమీలేదు.
- నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
మోదం.. ఖేదం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆశించినంత స్థాయిలో లేదు. జిల్లా కేటాయింపు లకు వచ్చే సరికి జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-విష్టుపురం -జాన్‌పహాడ్ రైల్వే మార్గానికి రూ.100 కోట్లు కేటాయించారు. కానీ నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి కేవలం రూ.కోటిలు మాత్రమే మంజూరు చేశారు. అసంతృప్తి కలిగించే అంశం.
- గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు కొంత ఊరట
Published Fri, Feb 27 2015 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement