అధికారుల నిర్లక్ష్యం కరువుసాయానికి గండి కొట్టింది. గత ఖరీఫ్‌లో తీవ్రమైన కరువు ఉందని, అందుకు రూ. 3,064.75 కోట్ల కరువుసాయం
♦ ఐదేళ్ల విపత్తు సాయానికి
♦ రూ.1,515 కోట్లు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం కరువుసాయానికి గండి కొట్టింది. గత ఖరీఫ్‌లో తీవ్రమైన కరువు ఉందని, అందుకు రూ. 3,064.75 కోట్ల కరువుసాయం కావాలని రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా రూ.791 కోట్ల సహాయం ప్రకటించింది. అయితే, రూ.712 కోట్లనే విడుదల చేసింది. మన అధికారుల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యం కారణంగా మిగిలిన రూ.79 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది.
2015-2020 సంవత్సరాల కోసం 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి విపత్తు నిర్వహణ శాఖకు కేంద్రం రూ.1,515 కోట్లు కేటాయించింది. 12 రకాల ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఈ సాయాన్ని ప్రతి ఏడాది కేటాయిస్తుంది. కేటాయించిన సొమ్ము సరిపోకపోతే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించాలి. ఆ ప్రకారం కేంద్రం అదనపు నిధులు కేటాయిస్తుంది. 2015-16 సంవత్సరానికి 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి విపత్తు సాయం కింద రూ.274 కోట్లు కేటాయించింది. అందులో రూ.79 కోట్లు మిగిలిపోయాయని కొందరు అధికారులు కేంద్రానికి తప్పుడు సమాచారమివ్వడంతో కరువు సాయంలో కోత విధించింది.
తాము పొరపాటు చేశామని, మిగిలిన సొమ్ము కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఒక రెవెన్యూ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. 2016-17 సంవత్సరానికి కేంద్రం 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు రూ.288 కోట్లు కేటాయించింది. 2017-18 సంవత్సరానికి రూ.302 కోట్లు, 2018-19 ఏడాదికి రూ.318 కోట్లు, 2019-20 సంవత్సరానికి రూ.333 కోట్లు కేటాయించింది. 2016-17 సంవత్సరానికి విడుదల కావాల్సిన రూ.288 కోట్లను జూన్ మొదటి వారంలో విడుదల చేస్తారు. ఈ నెలలోనే విడుదల చేయాలన్న రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తోంది.