పొలిటికల్‌ జోష్‌ | General Elections Political News In Warangal | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ జోష్‌

Published Sun, Aug 19 2018 9:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

General Elections Political News In Warangal - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనే విధంగా అధికార టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుండగా.. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం మరింత వేడి పుట్టిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మరింత పట్టు సాధించేందుకు టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. ఇప్పటికే రాజకీయంగా ఆయా నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ఎమ్మెల్యేలు సమస్యలపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా ప్రణాళికలు రూపొందించడంతోపాటు నియోజకవర్గ పర్యటనను విస్తృతం చేసేలా పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

15 రోజులుగా ఉమ్మడి జిల్లాలో మంత్రి తుమ్మలతోపాటు టీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు నియోజకవర్గ రాజకీయ కార్యకలాపాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు నిర్వహించడం.. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, పార్టీలో ఆది నుంచి ఉంటూ.. అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్‌ సైతం నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడంతోపాటు ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన పనుల పురోగతి, కేంద్ర పథకాల ద్వారా జిల్లాకు వచ్చిన సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు చేరుతున్న తీరు.. ఇంకా నిధులు  తెచ్చేందుకు గల అవకాశాలపై ఆరా తీసే పనికి పూనుకున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో దాదాపు ఏటికి ఎదురీదాల్సి వచ్చింది. పది నియోజకవర్గాల్లో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌.. కేవలం కొత్తగూడెం శాసనసభ స్థానాన్ని.. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు, మహబూబాబాద్‌ ఎంపీగా సీతారాంనాయక్‌ విజయం సాధించారు.

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో అగ్రనేతగా ఉన్న జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేసి.. 2014, సెప్టెంబర్‌ 4న టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు పలువురు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ అంజయ్య తదితరులు చేరగా.. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలిచిన బానోత్‌ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు ఆయా సందర్భాల్లో గులాబీ గూటికి చేరారు.
 
నాలుగింట్లో కాంగ్రెస్‌.. 
గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌ గాలి వీచినా.. జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ పది శాసనసభ స్థానాలకు.. నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత ఇల్లెందు, ఖమ్మం ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పాలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నికల్లో అప్పటివరకు ఎమ్మెల్సీగా ఉంటూ.. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల తరుణం ముంచుకొస్తుండటంతో ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ.. సీట్లు మావే, గెలుపు మాదే అంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏడుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టికెట్‌ ఖాయమనే ధీమాతో ఉండగా..  ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలకు సైతం టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు అందాయని ప్రచారం జరుగుతోంది.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనేక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రాచలం నుంచి సీపీఎంకు చెందిన సున్నం రాజయ్య, మధిర నుంచి కాంగ్రెస్‌కు చెందిన మల్లు భట్టి విక్రమార్క, సత్తుపల్లి నుంచి టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అక్కడ దీటైన అభ్యర్థులను బరిలోకి దిచేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఉమ్మడి జిల్లాలోని పది ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానని ఇటీవల టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన సభలో మంత్రి తుమ్మల ప్రకటించడంతో ఎన్నికల హడావుడి ప్రారంభమైనట్లయింది. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
 
పట్టున్న వాటిపై దృష్టి.. 
సీపీఐ, సీపీఎం సైతం వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమకు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాయి. అయితే ఎన్నికల నాటికి ఎవరితో పొత్తు ఉంటుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక టీడీపీ జిల్లాలో ఒకవైపు ఉనికి కోల్పోవడమే కాకుండా.. మరోవైపు సంస్థాగత సమస్యలతో సతమతమవుతోంది. పదవులను భర్తీ చేయడంలో పార్టీ వైఖరిని నిరసిస్తూ ద్వితీయ శ్రేణి నేతలు సాక్షాత్తూ టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుటే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అలాగే సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తమకు పట్టున్న ఇల్లెందు నియోజకవర్గంపై ఈసారి పూర్తిస్థాయి దృష్టి సారించి.. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక బీజేపీ సైతం కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండటం.. అనేక పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుండటంతో వాటిని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం ద్వారా జిల్లాలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేసే పనిలో నిమగ్నమైంది. బీజేపీ జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను నియమించడంతో ఆ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం నెలకొంది.
 
క్షేత్రస్థాయికి వైఎస్సార్‌ సీపీ.. 
ముఖ్యంగా గత ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యే స్థానాలతోపాటు ఒక పార్లమెంట్‌ స్థానాన్ని గెలుపొందిన వైఎ స్సార్‌ సీపీ ఈ ఎన్నికల్లో సైతం తన సత్తా చాటేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వేర్వేరుగా అధ్యక్షులను సైతం నియమించి.. కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కొల్లు వెంకటరెడ్డి  ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాతో దివంగత నేత వైఎస్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం, ఆయన అభిమానులను ఏకతాటిపై చేర్చి.. పార్టీ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement