నల్లగొండ టౌన్: ఉల్లి ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. ఒక్కసారిగా ధర పెరగడంతో ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. పదిహేను రోజుల క్రితం కిలో రూ. 15 నుంచి రూ. 18 వరకు ధర పలికిన ఉల్లి ప్రస్తుతం రిటేల్‌లో రూ. 22 నుంచి రూ.24 వరకు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో రూ.12 మాత్రమే ధర ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏర్పడిన కరువు పరిస్థితులలో జిల్లాలో ఎక్కడా కూడా ఉల్లిసాగు లేకపోవడంతో పాటు జిల్లాకు ఉల్లిగడ్డలను సరఫరా చేసే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దాంతో ఉల్లి ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాకు మహారాష్ట్రలోని నాగపూర్, షోలాపూర్, గుజరాత్ నుంచి ఉల్లి దిగుమతులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి.
దాంతో పాటు ఉన్న సరుకులను హోల్‌సేల్ వ్యాపారులు బ్లాక్ చేయడం వల్ల కూడా ధరలు పెరిగా యి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో దళారులు ధరలు పెంచినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రానికి గతంలో ప్రతి రోజూ మూడు లారీల ఉల్లిగడ్డ దిగుమతి అవుతుండేది. కానీ ప్రస్తుతం రెండు లారీలు మాత్రమే వస్తోంది.
ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగనున్నాయి.మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులు ఉల్లిగడ్డలను బ్లాక్ చేసే వ్యాపారులపై దృష్టిసా రించని కారణంగా వ్యా పారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ధరలను పెంచుతున్నారనే విమర్శలు విని పిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాయంత్రాం గం స్పందించి బ్లాక్ చేసే వ్యాపారులపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని, ఉల్లిగడ్డ ధరలను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఉల్లి లేకుండానే కూరలు
పెరిగిన ధరల కారణంగా ఉల్లిగడ్డ లేకుండానే కూరలు వండుకోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ధరలను తగ్గించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
- కె.సరోజ
తక్కువ ధరకు ప్రభుత్వమే అమ్మాలి
ఉల్లిధరలు సా మాన్యులకు అం దుబాటులో లేకుండా పో యాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లిగడ్డలను తక్కువ ధర కు అమ్మడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ధరలను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలి.
- కాంతయ్య