వేట షురూ..!
- గ్రేటర్‌లో 7878 ఓట్ల తొలగింపు
- ఓటర్ల జాబితాలో అర్హులకే చోటు
- పకడ్బందీ చర్యల్లో జీహెచ్‌ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బోగస్ ఓటర్లను అరికట్టడంతో పాటు అసలైన ఓట ర్లందరూ విధిగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు జీహెచ్‌ఎంసీ అవసరమైన చర్యలు చేపట్టింది. గ్రేటర్‌లో జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉండటం గత ఎన్నికల్లో దృష్టికి రావడంతో ఈసారి పకడ్బందీ చర్యలకు సిద్ధమయ్యారు.
వచ్చే డిసెంబర్‌లోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అర్హులైన ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు.. బోగస్ , డూప్లికేట్లు, మరణించినవారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇళ్లు మారినవారు, ఇళ్లకు తాళా లు వేసినవారికి తగు సూచనలు జారీ చేయడంతోపాటు అవసరమైన నోటీసులందజేసి, నిర్ణీత వ్యవధిలోగా స్థానికంగా ఉంటున్నట్లు తెలియజేయాల్సిందిగా హెచ్చరించినప్పటికీ స్పందించని వారితో సహ మృతులు తదితరులు వెరసి ఇప్పటి వరకు 7878 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
డూప్లికేట్ ఓట్లు 363, అనర్హులు 142, మృతులు 7182, చిరునామా మారినవారు 75, ఇళ్లకు తాళాలున్నవారు 116 (మొత్తం 7878) ఓట్లు తొలగించారు. జాబితాలోంచి తొలగించేందుకు ముందు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత చిరునామా లో వారు లేనట్లు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని, అవసరమైన నోటీసులిచ్చి, ఇరుగుపొరుగును సంప్రదించి తొలగించినట్లు స్పష్టం చేశారు. గ్రేటర్‌లోని 18 సర్కిళ్లకుగాను ఐదు సర్కిళ్లలో ప్రస్తుతం ఈ చర్యలు తీసుకున్నారు. సర్కిళ్ల వారీగా.. రాజేంద్రనగర్ సర్కిల్‌లో 416 ఓట్లు, .కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో 2654, అల్వాల్‌లో 2179, మల్కాజిగిరిలో 2260, సికింద్రాబాద్‌లో 369(మొత్తం 7878) ఓట్లు తొలగించారు. జాబితాలోంచి పేర్లు తొలగించేముందు మొత్తం 17,42,391 మందికి తుదినోటీసులు జారీ చేసి.. ఎలాంటి స్పందన లేనివారిపై విచారణ జరిపి, మృతులను ధ్రువీకరించుకొని..స్థానికంగా లేనట్లు నిర్ధారించుకొని జాబితానుంచి తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆధార్‌తో అనుసంధానం ఇలా..
- ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోని వారు వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకుంటే మంచిది. అనుసంధానం కోసం..
- సమీపంలోని పోలింగ్‌కేంద్రాలకు వెళ్లి ఆధార్, ఓటరుకార్డు వివరాలు అందజేయాలి.
- అదీ కుదరని వారు తమ సమీపంలోని మీసేవ కేంద్రాల్లో ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులను అందజేస్తే అనుసంధానిస్తారు.
- జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీనెంబరు 040-21 11 11 11ను లేదా 155304 నెంబరును సంప్రదించవచ్చు. ముఖ్య ఎన్నికల అధికారి టోల్‌ఫ్రీనెంబరు 1950ను కూడా సంప్రదించవచ్చు.
- ఎస్‌ఎంఎస్ ద్వారా, ఇంటర్‌నెట్ ద్వారా కూడా అనుసంధానం చేసుకోవచ్చు. ఎస్‌ఈఈడీఈపీఐసీ(సీడ్‌ఎపిక్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరుగుర్తింపుకార్డు నెంబరు వేసి స్సేస్ ఇచ్చి ఆధార్‌నెంబరు వేసి 8790499899 నెంబరుకు ఎస్‌ఎంఎస్ చేయవచ్చని జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు.
- ఇంటర్‌నెట్ ద్వారా (జ్ట్టిఞ:// 164.100. 132.184/్ఛఞజీఛి/్ఛజ్ఛ్ఛఛీజీజ.్జటఞ) కూడా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.
- ఓటరు జాబితాలో పేరు లేనప్పటికీ..కొత్తవారు కూడా సంబంధిత సర్కిల్‌లోని ఎన్నికల కార్యాలయంలో సంప్రదించి నమోదు చేసుకోవచ్చు.