సైబర్ నేరగాడి వేధింపులతో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.
సైబర్ క్రైమ్‌కు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాడి వేధింపులతో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైకు చెందిన రియల్టర్‌ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ పాలరాజు కథనం మేరకు.. చెన్నైలోని రాయపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పర్వేజ్ అలియాస్ సల్మాన్ (37)కు భార్య, ఇద్దరు పిల్లలు. యువతులను మోసగించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్న సల్మాన్... తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని, అమెరికాలో స్థిరపడ్డానని పేర్కొంటూ షాది.కామ్ వెబ్‌సైట్‌లో వధువు కావాలని ప్రకటన ఇచ్చాడు.
ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో పాటు మరో ఆరుగురు ఇతని వలలో పడ్డారు. అమెరికాలోని యువతితో సల్మాన్ తరచూ చాటింగ్ చేసేవాడు. ఈ చాటింగ్ శ్రుతిమించి చివరకు ఇద్దరి మధ్య నగ్న చిత్రాల వీడియో చాటింగ్‌కు దారి తీసింది. అయితే ఆమె క్లిప్పింగ్‌లను సేకరించిన సల్మాన్ యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను చెప్పినట్లు పెళ్లి చేసుకోవాలని లేని పక్షంలో నగ్న చిత్రాలను ఫేస్‌బుక్ ద్వారా బంధువులు, స్నేహితులకు పంపుతానని బెదిరించాడు. సల్మాన్ బ్లాక్‌మెయిల్‌తో కుంగిపోయిన ఆ యువతి ఇటీవలే అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. తనకు జరిగిన అన్యాయంతో పాటు మృతికి కార ణాలను సూసైడ్ నోట్ ద్వారా హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో యువతి తండ్రి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పర్వేజ్‌ను శనివారం అరెస్టు చేశారు.