ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది. స్థిరాస్తి, భూ క్రయవిక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. దస్తావేజుల సంఖ్య తగ్గి ప్రభుత్వానికి రాబడి కూడా తగ్గింది. ఐదేళ్లలో ఎప్పుడు లేనంతగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో పురోగతి ఏడు శాతం లోపే ఉండటంతో రిజిస్ట్రేషన్ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్ష్యం సాధింపులో ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడు క్షీణత ఉందని రిజిస్ట్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంచిర్యాల మినహా జిల్లా అంతటా రియల్ వ్యాపారంలో నిస్తేజం కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో మంచిర్యాల జిల్లా అవుతుందని అక్కడ కొనుగోళ్లు పెరిగినట్లు సమాచారం.
లక్ష్యంలో వెనుకంజ
జిల్లాలో స్థిరాస్తి, భూ క్రయవిక్రయాలు మందకొడిగా సాగుతున్నాయనడానికి గణాంకాలే నిదర్శనం. జిల్లాకు 2013- 14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.78.50 కోట్ల లక్ష్యం విధించగా కేవలం రూ.66.97 కోట్లు సాధించి 85 శాతమే లక్ష్యాన్ని చేరుకుంది. పురోగతి రేటు కేవలం 6.63 శాతం నమోదైంది. ఐదేళ్ల పురోగతిని పరిశీలిస్తే ఇదే అతి తక్కువ. జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, బోథ్ పరిధిలో క్రయ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. ఆసిఫాబాద్, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటల్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క మంచిర్యాలలో అమ్మకాలు, కొనుగోళ్లు ఊపు మీద ఉన్నాయి.
ఎందుకీ దుస్థితి..
జిల్లాలో రియల్ వ్యాపారం పడిపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ వర్గాలు, రియల్టర్లు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందటి వరకు ఊపు మీద ఉన్న రియల్ వ్యాపారం ఇప్పుడు తిరోగమనంలో ఉండటానికి ఆదిలాబాద్‌లో మనీ సర్క్యులేషన్ జరగకపోవటం ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఓ బడా పారిశ్రామికవేత్త వ్యాపారంలో దివాళా తీయడంతో కోర్టు ద్వారా ఇన్‌సాల్వెంట్ పిటిషన్(ఐపీ) పొంది వ్యాపారం బంద్ చేశారు. అదేవిధంగా బహిరంగ మార్కెట్‌లో బ్రోకర్లు భూముల ధరలు ఇష్టారీతిన పెంచి అమ్మడం, కేవలం అవే భూములు ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులకు మారుతూ వచ్చి ప్రసుత్తం అమ్మకాలు నిలిచాయి. ఆదిలాబాద్ చుట్టూ పక్కల ప్రభుత్వ నోటిఫైడ్ భూములు ఉండటంతో రియల్ వ్యాపారానికి కొత్త భూములు దొరకని పరిస్థితి ఉంది.
గతంలో రియల్టర్లు అధికారులను నయానో బయానో దారికి తెచ్చుకొని ప్రభుత్వ భూములు అమ్మేందుకు ఎన్‌వోసీని పొంది భూ క్రయవిక్రయాలు జరిపారు. రెండేళ్లుగా ఎన్‌వోసీ జారీని ప్రభుత్వం నిలిపివేసింది. అదేవిధంగా వెంచర్లు కొన్న తర్వాత వివాదాలు తలెత్తుతున్న సంఘటనల కారణంగా భూములు కొనాలనుకునే వారు ఆచి తూచి వ్యవహరించడం కూడా అమ్మకాలు తగ్గటానికి కారణం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? రాకముందు కొందామా? లేకపోతే వచ్చిన తర్వాత కొంటే బాగుంటుందా? అనే సంశయ ధోరణి కారణంగా చేతిలో డబ్బులున్నా పలువురు కొనుగోలుకు ముందుకు రాకపోవటం లేదు. రెండు నెలలుగా ఎన్నికల వేడి ఉండటంతో భూ కొనుగోలుదారులు వా యిదా వేస్తుండటం క్షీణతకు కారణంగా పలువురు అభిప్రాయ పడుతున్నారు.
రియల్ ఢమాల్
Published Mon, May 5 2014 1:33 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement