రంగారెడ్డి జిల్లాలో రియల్ ఢాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థిరాస్తి రంగంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు సమకూరే ఆదాయంలో ఏకంగా 49.55 శాతం జిల్లా నుంచే వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే అంచనాలను తలకిందులు చేస్తోంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాను ప్రభుత్వం రెండు భాగాలుగా విభజించింది.
ఇందులో రంగారెడ్డి డివిజన్ పరిధిలో చేవెళ్ల, వికారాబాద్, రాజేంద్రనగర్ రెవెన్యూ ప్రాంతాలుండగా.. రంగారెడ్డి తూర్పు విభాగాల్లో సరూర్‌నగర్, మల్కాజిగిరి రెవెన్యూ విభాగాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిల్లాకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,361.69 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో గత నెలాఖరునాటికి రూ.1,346.16 కోట్ల లక్ష్యం ఉండగా.. కేవలం రూ.690.84 కోట్ల ఆదాయం సమకూరింది. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 51.75శాతం మాత్రమే పురోగతి నమోదైంది.
విభజన ప్రభావంతో..
రాష్ట్రంలో భారీగా వృద్ధిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండుమూడేళ్లుగా రియల్ రంగం ఒకింత ఇబ్బందికరంగా ఉంది. తాజాగా రాష్ట్ర విభజన అంశంతో ఈ వ్యాపారం ఇబ్బందుల్లో పడిపోయిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఏపీ రాజధాని ఖరారు కావడంతో హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులు అక్కడికి తరలిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పలు కారణాలుగా స్థిరాస్తి విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో రియల్ రంగం కష్టాల్ని ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై స్పష్టత వస్తోంది. మరోవైపు ఇబ్రహీంపట్నం పరిధిలో టీసీఎస్ ప్రాజెక్టు ప్రారంభం కావడం.. ఏరోస్పేస్ జోన్‌గా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
రాబడి తగ్గినా.. స్థిరంగా ఆదాయం..
రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కారు ఖజానాకు వచ్చే ఆదాయంలో తగ్గుదల ఉండడం ఆందోళన కలిగించే అంశమే. కానీ గత ఏడు నెలల్లో వచ్చిన ఆదాయ గణాంకాల్ని పరిశీలిస్తే... రాబడిలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నెలవారీగా వచ్చిన ఆదాయ గణాంకాలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. ఈ గణాంకాలు స్థిరాస్తి వ్యాపారం పతనమైనట్లు కాదని నిపుణులు అభిప్రాయడపతున్నారు. హైదరాబాద్‌కున్న అనుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.