నందినికి మద్దతు తెలుపుతున్న గ్రామస్తులు, కిరోసిన్ పోసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుంటున్న పోలీసులు
మానకొండూర్: ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కలకాలం తోడుంటానన్నాడు. నమ్మిన ఆ యువతి ప్రేమను అంగీకరించింది. ఐదేళ్లకు పైగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చదువైపోగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇద్దరి చదువు పూర్తయ్యింది. ఇక పెళ్లి చేసుకుందామని యువతి కోరింది. అంతా సిద్ధం చేసుకుని ఆలయానికి వెళ్లారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతి పోలీసులను ఆశ్రయించగా.. ఇప్పుడా యువకుడు పెళ్లికి ముఖం చాటేశాడు. తాను ప్రేమించిన అమ్మాయి వద్దని ఇంటినుంచి పారిపోయాడు. దీంతో సదరు యువతి ప్రియుడి ఇంటిఎదుట బైఠాయించింది.ఈ ఘటన మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
ఐదేళ్లనుంచి ప్రేమ..
మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన అంతగిరి లక్ష్మయ్య– పరమేశ్వరి దంపతుల పెద్దకూతురు నందిని(25) ఏంబీఏ పూర్తిచేసింది.ఇదే గ్రామానికి చెందిన ఎనగంటి గణపతి, గంగా దంపతుల చిన్నకొడుకు ఎనగంటి శ్రీధర్ ఊరాఫ్ లక్ష్మణ్(24) డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పెద్దపల్లిలో ఉంటున్నాడు. ఐదేళ్లక్రితం నందినిని ప్రేమించమని శ్రీధర్ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ప్రేమను అంగీకరించింది. ఇద్దరి చదువు పూర్తయ్యింది. మధ్యలో నందినికి వచ్చిన పెళ్లి సంబంధాలను శ్రీధర్ చెడగొడుతూ వచ్చాడు. తమ కూతురును పెళ్లి చేసుకుంటానని నందిని తల్లిదండ్రులకూ మాటిచ్చాడు.
పెళ్లి వరకు వెళ్లి..
ఇటీవల శ్రీధర్ సోదరుడి వివాహమైంది. ఇదే క్రమంలో నందిని – శ్రీధర్ ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలిసింది. దీంతో బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందాని అనుకున్నారు. గత ఆదివారం తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్‌లోని నృసింహుని ఆలయం వద్దకు వెళ్లారు. తాళి కట్టేసమయంలో శ్రీధర్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. వారి వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి సాయంతో శ్రీధర్‌ను తీసుకెళ్లారు.
పోలీసులను ఆశ్రయించిన యువతి..
నందిని మానకొండూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇరుకు టుంబాలను పిలిపించి సీఐ ఇంద్రసేనారెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చా రు. నందినిని పెళ్లి చేసుకోవాలని శ్రీధర్‌కు సూచించగా నిరాకరించాడు. మరుసటి రోజునుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు.
మోసపోయానని బైఠాయింపు..
మోసపోయానని గ్రహించిన నందిని తనకు న్యాయం చేయా లని శనివారం ఉదయం ప్రియుడి ఇంటిఎదుట బైటాయించింది. శ్రీధర్ తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చుంది. నందినికి రజక కులస్తులు, గ్రామస్తులు, మహిళా సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నందినితో మాట్లాడుతున్న క్రమంలోనే కిరోసిన్ పోసుకునేందుకు యత్నించింది.
పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు. నందినిని మద్దతుగా నిలిచిన రజకసంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ మాట్లాడుతూ... శ్రీధర్‌కు దగ్గర బంధువైన శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే పెళ్లికి నిరాకరించాడని ఆరోపించారు. న్యాయం చేయకుంటే మూడువేల మందితో శ్రీధర్ ఇంటిఎదుట ఆందో ళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు నడిగొట్టు రవి, శాతరాజు యాదగిరి, సంపత్, ముత్తూరి కొంరయ్య రాయికంటి కిరణ్, గంగధర లక్ష్మయ్య, అంతగిరి సంపత్ తదితరులు మద్దతుగా నిలిచిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment