రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం కేసీఆర్ స్పష్టతనివ్వాలి
పరిగి : తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో చాలా అంశాలపై స్పష్టత కొరవడిం దని ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. గురువారం పరిగిలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల అమలుపై గవర్నర్ వివరణ ఇవ్వలేక పోయారన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలోనైనా పథకాలు, కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టతనివ్వాలని సూచించారు.
సోనియాగాంధీ స్పందించకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఉండేది కాదని పేర్కొన్నారు. అయితే అధికారంలో ఉన్న కారణంగా ప్రజలతో కలసి ఉద్యమంలో పాల్గొనలేకపోయామని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ఓటమిపాలైందని విశ్లేషించారు. కృష్ణా నదిపై ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు, కొత్తగా నిర్మించే వాటికి నీరందాలంటే గోదావరి నదితో అనుసంధానం చేయకతప్పదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే దివంగత సీఎం వైఎస్సార్ నదుల అనుసంధానానికి ప్రణాళిక రూపొందించారని తెలిపారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి తేవాలని, కాంగ్రెస్ పార్టీ ఇందుకు సహకరిస్తుందని అన్నారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దర్గాలు, ఈద్గాల అభివృద్ధికి రూ.20లక్షలు మంజూరయ్యాయని, వాటితో ప్రహరీలు నిర్మిస్తామని తెలిపారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు సుభాష్‌చందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆంజనేయులు, దస్తగిరి పటేల్ పాల్గొన్నారు.