- సీఎం రిలీప్‌ఫండ్ గోల్‌మాల్
- చికిత్సలు లేకుండానే నకిలీ బిల్లులు
- జిల్లా నుంచే ఎక్కువ!
- గుర్తించిన సీఎంఆర్‌ఎఫ్ అధికారులు
- విచారణకు త్వరలో జిల్లాకు రానున్న సీఐడీ
సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి సహాయ నిధిలో నకిలీ బిల్లుల వ్యవహారం చర్చనీయాంశమైంది. జిల్లా నుంచి కూడా చాలా వరకు బిల్లులు ఉండడంతో నకిలీల బండారం బయటపడనుంది. సూత్రధారులెవరో.. పాత్రధారులెవరో తేలనుంది. ఈ విషయంలో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, నకిలీ బిల్లులు సృష్టించిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. తమ నియోజకవర్గాల పరిధిలో ఎవరైనా ప్రమాదవశాత్తు, లేక ఇతర ఆరోగ్య పరమైన చికిత్సలు చేయించుకుని ఆర్థికసాయం కోసం వస్తే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రతిపాదనలు పంపుతారు.
అయితే.. చికిత్స చేయకున్నా చేయించినట్లు నకిలీ బిల్లులు పెట్టి కొందరు రిలీఫ్ ఫండ్ తీసుకున్నట్లు సీఎం కార్యాలయ అధికారులు గుర్తించారు. ఇలా నల్లగొండ, వరంగల్ జిల్లాతోపాటు మన జిల్లా నుంచి ఇలా నకిలీ బిల్లులు అందాయి. అంతేకాకుండా చికిత్సకు అయిన బిల్లు స్వల్పంగా ఉంటే భారీగా చూపుతూ బిల్లులు పంపారు. ప్రజాప్రతినిధులే సీఎంఆర్‌ఎఫ్‌కు ఈ బిల్లులను సిఫార్సు చేశారు. తెలంగాన ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా బిల్లులు మంజూరు కాగా ఇందులో జిల్లాలో వందల సంఖ్యలో బిల్లులు ఉన్నాయి.
నకిలీ బిల్లుల్లో మన జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు సీఎంఆర్‌ఎఫ్ అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో ఈ బృందం జిల్లాకు వచ్చి అసలు బిల్లు మంజూరైన లబ్ధిదారులు ఎక్కడ ఉంటున్నారు.. వారు ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారు.. ఆస్పత్రి యాజమాన్యం ఎంత బిల్లు వేసింది..? తదితర వివరాలు అన్ని సేకరించనుంది. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో ప్రజప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
సహాయం కోసం వచ్చే వారికి సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, బిల్లులు నకిలీవని ఎలా గుర్తుపట్టాలని వారు పేర్కొంటున్నారు. సీఐడీ విచారణ చేస్తే జిల్లా వ్యాప్తంగా నకిలీ బిల్లుల వ్యవహారం గుట్టురట్టు కానుంది. ఈ వ్యవహారంలో ఎవరైనా ప్రజాప్రతినిధులకు సంబంధం ఉన్నట్లు తేలితే ఇక నుంచి వారు సీఎం కార్యాలయానికి వైద్యం కోసం సహాయం అందించే ప్రతిపాదలను తిరస్కరించే అవకాశం ఉంది.
అయితే 2012 నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 362 బిల్లులకు వైద్యం కోసం సహాయం అందింది. ఇందులో ఇంకా 11 బిల్లులు పంపిణీ చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా సీఎం కార్యాలయానికి వచ్చే బిల్లుల వ్యవహారంలోనే నకిలీవి వచ్చినట్లు కార్యాలయ అధికారులు గుర్తించారు.