జిల్లాలో గురువారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. నందిగామ మండలం మునగచర్ల, గుడ్లవల్లేరు మండలం అంగలూరు, జంక్షన్ సమీపంలోని శేరినరసన్నపాలెంలో ఈ ఘటనలు జరిగాయి. మృతుల్లో ఒకరు బాలుడు. మునగచర్ల సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు రైతులు మరణించారు.
నందిగామ రూరల్ : నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మహిళలతో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం.. నందిగామ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ మునగచర్ల సమీపంలోకి రాగానే డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గిం చాడు.
ఆ సమయంలో లారీ వెనుక మోటార్ సైకిల్, దాని వెనుక కారు వస్తున్నాయి. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించడంతో వెనుక వస్తున్న కారును డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దీంతో కారు బైక్‌ను, లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు లారీ, కారు మధ్య నలిగి అక్కడికక్కడే మరణించారు. మృతులిద్దరూ పెనుగంచిప్రోలు మండలం బండిపాలెం గ్రామానికి చెందిన రైతులు కాట్ల రమేష్(35), కాసరగడ్డ శ్రీనివాసరావు(50)గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన యనగాల నూకానమ్మ (బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు), నందిగామ మండలం కొండూరుకు చెందిన ఎం కనకదుర్గ, నందిగామకు చెందిన వాసిరెడ్డి పూర్ణచంద్రరావు, నందిగామ మండలం సోమవరానికి చెందిన బాదినేని రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. నూకానమ్మ తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సరుకుల కోసమని వచ్చి...
బండిపాలెం గ్రామానికి చెందిన రైతులు కాట్ల రమేష్, కాసరగడ్డ శ్రీనివాసరావు బైక్‌పై నంది గామ వచ్చారు. సరుకులు, కూరగాయలు, వ్యవసాయానికి సంబంధించి కొన్ని విత్తనాలు కొనుగోలు చేశారు. వాటితో స్వ గ్రామం తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన జరి గింది. ఘటనా స్థలిని నందిగామ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
కన్నీరు మున్నీరైన కుటుంబీకులు..
ప్రమాద వార్త తెలియగానే బండిపాలెం గ్రామం నుంచి మృతుల కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఘటనాస్థలికి వచ్చారు. ఛిద్రమైన మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించడం అక్కడ ఉన్నవారి కంట తడి పెట్టించింది. ఘటనా స్థలిలో కూరగాయలు, సరుకులు, పలు రకాల విత్తనాలు చిందరవందరగా పడి ఉన్నాయి. రమేష్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కార్మికుడి ఉసురు తీసిన బస్సు
శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై మండలంలోని శేరినరసన్నపాలెంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయనగరం వెళ్లి తిరిగి వస్తోంది. శేరినరసన్నపాలెం గ్రామంలో డెల్టా సుగర్స్ వద్ద సైకిలుపై గడ్డి మోపుతో వెళుతున్న చెరువూరి వెంకట కృష్ణారావు(55)ను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. గ్రామంలోని ముందడుగు కాలనీకి చెందిన కృష్ణారావు డెల్టాసుగర్స్‌లో సీజనల్ కార్మికుడు. అదే కాల నీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే కాలనీవాసులు అక్కడకు చేరుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తె లు, కుమారుడు ఉన్నారు. ఎస్సై పాటి వాసు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. బస్ డ్రైవర్ సి.శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జెడ్పీసీటీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, సంజీవరావు దంపతులు వచ్చి కృష్ణారావు మృతదేహం వద్ద నివాళులర్పించారు.
బాలుడి పాలిట మృత్యుశకటం
అంగలూరు(గుడ్లవల్లేరు) : పొలం వద్దకు వెళ్లిన తల్లిని కలుసుకునేందుకు సైకిల్‌పై బయలుదేరిన బాలుడి ప్రాణాలను లారీ మృత్యువు రూపంలో కబళించింది. పోలీసులు తెలిపిన తెలిపిన సమాచారం ప్రకారం.. మండలంలోని అంగలూరు గ్రామానికి చెందిన దాసి చిలకమ్మ గురువారం పొలానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుమారుడు రవితేజ(14) సైకిల్‌పై ఆమె వద్దకు బయలుదేరాడు. ఊరి శివారులో మలుపు వద్ద తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొట్టింది. అప్పటికీ డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో లారీ ముందున్న మరో సైకిల్‌ను కూడా ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవితేజ అక్కడికక్కడే మరణించాడు. మరో సైకిల్‌పై వెళుతున్న ఉచ్చుల రాఘవులు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఎ.గణేష్‌కుమార్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్ పెంటుమాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం గురించి తెలియగానే రవితేజ తల్లి చిలకమ్మ ఘటనాస్థలికి వచ్చింది. కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. చేతికంది వస్తున్న కుమారుడిని కాలం కాటేసిందం టూ ఆమె విలపించడం అక్కడ ఉన్న వారిని ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
రహదారులు రక్తసిక్తం
Published Fri, Aug 1 2014 2:48 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement