సాక్షి, హైదరాబాద్: లాటరీలో లక్కు దక్కని మద్యం వ్యాపారులు మరో ప్రయత్నానికి తెరలేపారు. రూ. లక్షలకు లక్షలు గుడ్‌విల్ ఎరవేసి వ్యాపారం సొంత చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కో దుకాణానికి రూ. 20 లక్షల నుంచి రూ. ఒక కోటి వరకు ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. డీల్ కుదిర్చిన మధ్యవర్తులకు కూడా రూ. 5 లక్షల వరకు ముట్టజెప్పేందుకు సిద్ధపడుతున్నారు. అప్పనంగా నజరానా వస్తుండటంతో స్థానిక ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తులుగా మారి డీల్ కుదురుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్ర పరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో ఈ దందా జోరుగా సాగుతోంది.
భానుపురిలో దందా జోరు....
సూర్యాపేట జిల్లాలోని 71 మద్యం దుకాణాలకు ఈసారి డ్రాలో 54 మందికి వ్యాపారంలో అనుభవం లేని వారికే దుకాణాలు దక్కాయి. దీంతో మద్యం సిండికేట్లు వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లైసెన్స్‌దారునికి సన్నిహితంగా ఉండే వారిని ఒప్పించి వారి ద్వారా బేరసారాలకు దిగుతున్నారు. రాజకీయ నేతలతో ఒత్తిడి చేయిస్తున్నారు. గుడ్‌విల్ ఎరకు పడిపోతున్న కొందరు కొత్త లైసెన్స్‌దారులు సిండికేట్లకు దుకాణాలు అప్పగిస్తుండగా.. మరికొందరు డబ్బులు తీసుకొని వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటున్నారు.రికార్డు స్థాయి దరఖాస్తులతో రాష్ట్రంలోనే సంచలనంగా మారిన జాన్‌పహాడ్ మద్యం దుకాణాన్ని చేజిక్కించుకునేందుకు మద్యం సిండికేటు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సిండికేటు ఈ దుకాణం కోసం రూ. 80 లక్షలు ఆఫర్ చేయగా... మరో వర్గం ఏకంగా రూ. కోటి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దుకాణ లైసెన్స్ దక్కించుకున్న వ్యక్తికి, సిండికేటు మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి. మునగాల మండలంలో ఓ దుకాణాన్ని రూ. 63 లక్షలకు, మేళ్లచెరువులోని ఓ షాపును రూ.44 లక్షలకు, గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని దుకాణాన్ని రూ. 48 లక్షలకు, హుజూర్‌నగర్‌లోని ఓ షాపును రూ. 40 లక్షలకు, సూర్యాపేటలో రెండు దుకాణాలకు రూ 40 లక్షలు, తుంగతుర్తి మండల కేంద్రంలోని దుకాణానికి రూ. 15 లక్షలు చెల్లించి సిండికేటు గ్రూపులు వ్యాపారాన్ని సొంతం చేసుకున్నాయి.
సిద్దిపేటలో సీన్ రివర్స్...
చిన్నకోడూరు మండలం జక్కపూర్ గ్రామం లోని ఓ మద్యం దుకాణానికి జనగామ జిల్లాకు చెందిన సిండికేటు దరఖాస్తు దాఖలు చేసింది. గతేడాది 10 మంది చొప్పున మూడు సిండికేటు గ్రూపులు, ఈ ఏడాది అందరూ కలసి ఒకే గ్రూపుగా ఏర్పడి 30 దుకాణాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఎవరి పేరు మీద దుకాణం వచ్చినా ప్రతి బృందానికి 33 శాతం ఇవ్వాలనే ఒప్పందం చేసుకున్నారు. అయితే సిండికేటు మొత్తానికీ ఒక ఎన్‌ఆర్‌ఐ పేరిట దరఖాస్తు చేసుకున్న జక్కాపూర్ దుకాణానికి మాత్రమే లాటరీ తగలగా ఆ ఎన్‌ఆర్‌ఐ మాట మార్చారు. దుకాణం ఇవ్వనని మొండికేయడంతో సిండికేటు గ్రూపు ఆయన్ను నిర్బంధించి నిలదీసింది. ఎన్‌ఆర్‌ఐకి మద్దతుగా స్థానిక టీఆర్‌ఎస్ నేత రావడంతో పెద్ద మనుషుల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.
ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తులు?
ఒకరికి వచ్చిన దుకాణాలు మరొకరు నడపటం ఎక్సైజ్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. కానీ రూ. లక్షలకు లక్షలు గుడ్‌విల్ ఇచ్చి వ్యాపారం తీసుకునే వాళ్లు పెట్టుబడులుపోనూ లాభాలు ఆర్జించేందుకు వక్రమార్గం పడతారనేది స్పష్టం. ఇటు వంటి దాన్ని స్థానిక ఎక్సైజ్ అధికారులు ఆదిలోనే గుర్తించి నివారించాలి. కానీ సిండికేట్లు మధ్యవర్తికి రూ. 5 లక్షల వరకు నజరానా ముట్టజెప్పుతుండటంతో... ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తిత్వం చేసి దుకాణాలు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే రూ. లక్షల్లో గుడ్‌విల్ ముట్టజెపినప్పటికీ మద్యం వ్యాపార లైసెన్స్ మాత్రం లాటరీలో దుకాణం దక్కించుకున్న వారి పేరిటే ఉంటుందని, ఆయా దుకాణంలో ఏదైనా నేరం జరిగితే లైసెన్స్‌దారుడినే ముందు జైల్లో పెడతామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.