లక్కెవరిదో..?
- లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు
- 315 దుకాణాల లెసైన్స్‌లకు నోటిఫికేషన్
- కరీంనగర్‌లో అత్యధిక ఫీజు రూ.42 లక్షలు
- దరఖాస్తు గడువు 21.. డ్రా 23.. లెసైన్స్ జారీ 30
- జూలై నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలు
కరీంనగర్ క్రైం: 2014-15 సంవత్సరానికి జిల్లాలోని 315 మద్యం దుకాణాల కేటాయింపునకు ఆదివారం నోటిఫికేషన్ వెలువడింది. జనాభా లెక్కన దుకాణాలను మూడు స్లాబులుగా విభజించి నోటిఫికేషన్ జారీ చేశారు. లాటరీ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు ఏడాది కాలంపాటు షాపులు నిర్వహించుకునేందుకు లెసెన్స్‌లు ఇస్తారు. సోమవారం నుంచి జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉం టాయని అధికారులు తెలిపారు. ఒక్కో ఫారం ధర రూ.25 వేలు. దరఖా స్తు చేసుకోవడానికి ఈనెల 21న సాయంత్రం 5 గంటల వరకు గడువుం ది. వచ్చిన దరఖాస్తులను 23న ఉదయం 11 గంటల నుంచి కలెక్టర్ అ ధ్వర్యంలో లాటరీ తీసి దుకాణాలు కేటాయిస్తారు. ఈ నెల 24 వరకు ప్రొవిజన్ లెసైన్స్‌లు జారీ చేసి, 30న లెసైన్స్‌లు జారీ చేస్తారు. దుకాణా లు పొందిన వ్యాపారులు జూలై ఒకటో తేదీ నుంచి మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు.
శాశ్వత లెసైన్స్ ఫీజు
10వేల లోపు జనాభా ఉంటే రూ.32.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.42 లక్షలు, 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.50 లక్షలుగా ధర నిర్ణయించారు. ఇతర జిల్లాల కంటే కరీంనగర్ జిల్లాలో 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉన్న మద్యం దుకాణాలకు రూ.4 లక్షలు అదనంగా ధర నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో 3 లక్షల జనాభాలోపే ఉండటంతో అత్యధిక లెసైన్స్ ఫీజు రూ.42 లక్షలుగా ఉండనుంది. గతంలో వసూలు చేసిన 14.01 శాతం ప్రివిలేజ్ టాక్స్‌ను ఈసారి 13.6 శాతానికి తగ్గించారు. అధిక ధరలకు అమ్మకాలు చేసే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.లక్ష, రెండోసారికి రూ.రెండు లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే దుకాణం లెసైన్స్‌ను రద్దు చేస్తారు.
అమ్ముడు పోయేనా..?
2013-14 సంవత్సరానికి 315 దుకాణాలకు గాను 267 దుకాణాలకే దరఖాస్తులు వచ్చాయి. 48 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. చివరకు ఎక్సైజ్ శాఖ ఏడాది కాలంలో పదిసార్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా వాటిలో సగం దుకాణాలను కూడా తీసుకోవడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. ఈసారైనా అన్ని దుకాణాలు దరఖాస్తులు వస్తాయా లేదా అని అధికారులు మదనపడుతున్నారు.