గూగుల్ ఉద్యోగిపై దాడి: డబ్బు దోపిడీ
హైదరాబాద్: ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న గూగుల్ సంస్థ ఉద్యోగిపై ఐదుగురు దొంగలు దాడి చేసి డబ్బు దోచుకున్నారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... శ్రీనగర్‌కాలనీలో నివసించే వినయ్‌భాస్కర్ గూగుల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వినయ్‌భాస్కర్ తన సోదరుడు సుధాకర్‌తో కలిసి ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు.
ఫిలింనగర్ నోవా ఆసుపత్రి వద్ద ఐదుగురు దుండగులు వారిని ఆపారు. ఇద్దరిపై దాడి చేసి జేబులో ఉన్న డబ్బు లాక్కొన్నారు. తన వద్ద వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయని వినయ్‌భాస్కర్ చెప్పగా... ఇంతే ఉన్నాయా? అంటూ ఆయనపై దాడి చేశారు. తీవ్రగాయాలకు గురైన వినయ్‌భాస్కర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.