చేవెళ్ల రూరల్: సాగుకు సబ్సిడీపై యంత్ర పరికరాలు కరువయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సబ్సిడీపై యంత్రాల పంపిణీ గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన జారీ చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.సాధారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే సబ్సిడీ యంత్ర పరికరాల గురించి ప్రభుత్వం స్పష్టతనిస్తుంది. ఏ పరికరానికి ఎంత సబ్సిడీ ఇవ్వనుందో, ఒక్కో మండలానికి ఎన్ని పరికరాలు కేటాయించనున్నారో అధికారులకు తెలియజేస్తుంది.
అయితే ఈసారి మాత్రం సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ గురించి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఖరీఫ్‌లో సాగు చేసిన రైతులకు ఇప్పుడు పంటలో కలుపు తీయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే పవర్ వీడర్ యంత్రాన్ని ఉపయోగించి సాధారణంగా రైతులు కలుపు తీస్తుంటారు. ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే ఈ పరికరాల గురించి ఈసారి మాత్రం ఎలాంటి సమాచారం లేకపోవడంతో రైతులు కూలీల సాయంతో కలుపుతీత పనులు చేపట్టారు.
కూలీల కొరతతో కొత్త సమస్యే కాకుండా పెట్టుబడి కూడా పెరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూన్ మాసంలోనే సబ్సిడీపై యంత్ర పరికారల గురించి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఒక్కో పరికరంపై 30 నుంచి 50శాతం వరకు రాయితీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఆ ఊసే లేదు. అయితే గతంలో ఇచ్చిన సబ్సిడీ పక్కదారి పట్టిందని, ఈసారి మాత్రం నేరుగా రైతు ఖాతాల్లోనే సబ్సిడీ సొమ్ము జమ అయ్యేలా చూస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
ఆ తర్వాత దీనిపై స్పష్టతనివ్వలేదు. దీంతో అధికారుల్లో కూడా సబ్సిడీ గతంలోమ మాదిరిగానే ప్రకటించాలా..? లేక నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలా అనే విషయంపై అనుమానాలుండటంతో వారు మిన్నకుండిపోయారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా సబ్సిడీపై స్పష్టత నివ్వాలని రైతులు కోరుతున్నారు.
సబ్సిడీ ఊసే లేదు!
Published Sun, Aug 10 2014 11:40 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement