కొత్తకోట (మహబూబ్‌నగర్ జిల్లా) : విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కొత్తకోటలో బీసీ సంక్షేమ సంఘం గురువారం కొత్తకోట చౌరస్తాలో దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తాలుకా ప్రధాన కార్యదర్శి జి. యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ.. గత ఏడాది ఫీజుల బకాయిలు రూ. 850 కోట్లను ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. ఇంటర్మీడియట్ కోర్సు ఫీజులు రూ. 1800 నుంచి రూ. 8 వేలకు పెంచాలన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు ప్రభత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు.