సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సమగ్ర కుటుంబ సర్వే’పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఒకే రోజు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహణకు సరిపడా సిబ్బంది సమకూరే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వేను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాలని నిర్దేశించింది.
ఈ సర్వేను ఏకకాలంలో నిర్వహించడం ద్వారా అక్రమార్కులను సులువుగా తొలగించవచ్చని భావించింది. ప్రభుత్వం సంకల్పం మంచిదే అయినా, జిల్లా విషయానికి వచ్చేసరికి ఒకే రోజు సర్వే నిర్వహణ ఆచరణసాధ్యంగా కనిపించడంలేదు. జిల్లాలో 15.12 లక్షల ఇళ్లల్లో సుమారు 60 లక్షల జనాభా వివరాలను సేకరించడం యంత్రాంగానికి కత్తిమీద సామే. ఒక ఎన్యుమరేటరు (సర్వే చేసే వ్యక్తి) సగటున 25 ఇళ్లను సర్వే చేసే అవకాశముంటుందని అంచనా. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా ఒకే రోజు సర్వే నిర్వహించాలంటే దాదాపు 60వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం లెక్క గట్టింది.
అందుబాటులో 22 వేలే..!
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సమగ్ర సర్వే’కు జిల్లాలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా తయారైంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తరగతి మినహా అన్ని కేట గిరిల ఉద్యోగులను ఈ విధులకు వినియోగించుకోవాలని భావించిన యంత్రాంగం.. ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఈ క్రమంలో 22వేల మంది ఉద్యోగులున్నట్లు అధికారులు తేల్చారు. సర్వేకు అవసరమున్న స్థాయి లో సిబ్బంది సమకూరకపోవడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న యంత్రాంగం.. సార్వత్రిక ఎన్నికల విధుల్లో వినియోగించుకున్న సిబ్బందిని తాజా సర్వేకు వినియోగించుకోవాలని యోచిస్తోంది.
అంత ఈజీ కాదు..
జిల్లాలోని ప్రైవేటు సంస్థల్లో దాదాపు 10వేల మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న మరో 10వేల మంది ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 2 వేల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను, బ్యాంకుల్లో పనిచేస్తున్న మరో 8వేల మంది, జంటనగరాల్లోని ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాల్లోని 3వేల మంది ఉద్యోగులతో పాటు జీహెచ్‌ఎంసీలో పనిచేసే 2వేల మంది సిబ్బందిని ఈ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కార్యచరణ రచిస్తోంది. అయితే ఈ ఉద్యోగులను సర్వే ప్రక్రియలోకి దించాలంటే ఆయా శాఖల ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ, బ్యాంకు సిబ్బందిని సర్వేలోకి దించడం ఆషామాషీ వ్యవహారం కాదని అధికారవర్గాలే అంటున్నాయి.
గ్రామాలకే పరిమితం చేస్తే...
ప్రస్తుతం జిల్లాలో 15.12 లక్షల కుటుం బాలుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4.12 కుటుంబాలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆరు మున్సి పాల్టీలలో సర్వే చేసేందుకు 16వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 19వ తేదీన ‘ఇంటింటి సర్వే’ను జీహెచ్‌ఎంసీ పరిధిని మినహాయించి గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా యంత్రాంగానికి సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ సర్వేకు కేవలం 16వేల మంది సిబ్బంది మాత్రమే అవసరమని భావిస్తూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో రోజు సర్వే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. సిబ్బంది కొరత దృష్ట్యా ఒకే రోజు జంట జిల్లాల్లో సర్వే అసాధ్యం కనుక.. మరో రోజు పొడిగించే అంశంపై కూడా చర్చలు సాగిస్తోంది.
పల్లెలకే పరిమితం!
Published Wed, Aug 6 2014 2:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement