తెట్టెలు కట్టిన మురుగు.. గుట్టలుగా పోగుబడిన వ్యర్థాలు.. చూస్తేనే ‘జల’దరింప చేసేలా ఉన్న ఇది మురుగు కాలువ కాదు. జీవనది గోదావరి. మంచి ర్యాల పట్టణం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని గృహ, పారిశ్రామిక వ్యర్థ జలమంతా రాళ్లవాగు ద్వారా నేరుగా వచ్చి గోదావరిలో ఇలా కలుస్తోంది. నీటిలో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) స్థాయి లీటరుకు 3 మిల్లీగ్రాములు మించితే ప్రమాదకరంగా భావిస్తారు. అయితే, గోదావరిలో బీఓడీ స్థాయి 4 నుంచి 9 మిల్లీగ్రాముల వరకు ఉందంటే.. ఈ జీవనవాహిని ఎంతటి కాలుష్య కాసారంగా మారిపోతోందో అర్థం చేసుకోవచ్చు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయినిలుగా ఉన్న నదీమ తల్లులు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నా యి. నిత్యం వేల గ్యాలన్ల మురుగునీరు, టన్నుల కొద్దీ చెత్త, పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామ, పట్టణ ప్రాంతాల నుంచి శుద్ధి చేయని మురుగును నదిలోకి వదిలేస్తుండటం, ప్లాస్టిక్ వంటి ఘన వ్యర్థాల కారణంగా వందల కిలోమీటర్ల మేర గోదావరి, కృష్ణా నదులు కలుషితమవుతున్నాయి. దీంతో నదుల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి, ఆ నీరు తాగడానికి, స్నానం చేసేందుకే కాదు కనీసం జలచరాలు కూడా బతకలేని పరిస్థితిని తీసుకొస్తున్నాయి.
అత్యంత ప్రమాదకరంగా గోదావరి..
బాసర నుంచి భద్రాచలం వరకు 500 కి.మీ.ల మేర ప్రయాణిస్తున్న గోదావరిలో 4 ఉపనదులు, మరిన్ని నాలాలు కలుస్తున్నాయి. నది పరీవాహకంలోని 19 ప్రధాన పట్టణాల నుంచి గోదావరిలో అవ్యవస్థీకృత వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి చేరుతోంది. బాసర వద్ద గోదావరిలోకి మహారాష్ట్రలోని పరిశ్రమల ద్వారా, భద్రాచలం వద్ద ఐటీసీ కాగితపు పరిశ్రమల ద్వారా వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలంలో మురుగునీటి శుద్ధి కేంద్రం లేకపోవడంతో ఆ నీరంతా బూర్గంపహాడ్ వద్ద నదిలో కలుస్తోంది. మంచిర్యాల పట్టణ మురుగునీరు రాళ్లవాగు ద్వారా, ధర్మపురి పుణ్యక్షేత్రం వద్ద నాలాల ద్వారా మురుగు గోదావరిలోకి వస్తోంది. మొత్తంగా 54 పరివాహక పట్టణాల్లోని మురుగు కాల్వల ద్వారా గోదావరిలోకి వచ్చి చేరుతున్నట్లు ఇదివరకే గుర్తించారు.
ఈ పరివాహక పట్టణాల్లో 22.57 లక్షల మేర జనాభా ఉండగా ఇక్కడ రోజుకు 249.81 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) మేర నీరు వినియోగిస్తుండగా అందులో 200 ఎంఎల్‌డీ మురుగు నదిలో చేరుతోంది. రోజుకు 6.75 లక్షల కేజీల ఘన వ్యర్థాలు నదిలో చేరుతుండటం మరింత సమస్యగా మారుతోంది. దీనికి తోడు పరీవాహకం వెంట ఉన్న 244 పరిశ్రమల ద్వారా 8,825 కేఎల్‌డీల వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. దీంతో నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ (డీఓ) పరిమాణం క్రమంగా తగ్గుతోంది. డీఓ పరిణామం లీటర్‌కు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. కానీ ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక నీటిలో బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) లీటర్‌కు 3 మిల్లీగ్రాములు మించొద్దని నిబంధనలు ఉన్నా.. ప్రస్తుతం నదిలో బీవోడీ స్థాయి 4 నుంచి 9 మిల్లీగ్రాములు/లీ వరకు ఉంది.
దీంతో నదిలోని నీరు తాగేందుకు కానీ, స్నానాలకు కానీ వాడేందుకు పనికి రావు. డీవో తగ్గేకొద్దీ బీఓడీ పెరుగుతూ వస్తోంది. గోదావరికి ఉపనది అయిన మంజీరాలోనూ బీఓడీ స్థాయి ఏకంగా 5 ఎంజీ/లీ నుంచి 26ఎంజీ/లీటర్‌గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. నక్కవాగులో సైతం బీఏడీ శాతం ఏకంగా 26 ఎంజీ/లీటర్‌గా నమోదైంది. ఇక వరంగల్ నుంచి సోమన్‌పల్లి వరకు ఉన్న మానేరులోనూ 6–20ఎంజీ/లీటర్‌గా బీఓడీ నమోదు కావడం గమనార్హం. ఇవే పరిస్థితులు కొనసాగితే మున్ముందు జలచరాలకు తీవ్ర గడ్డు పరిస్థితులు తలెత్తడంతో పాటు సాగు అవసరాలను తీర్చడం ఇబ్బందికరంగా పరిణమించనుంది.
కృష్ణాలోనూ అదేతీరు..
కృష్ణా నదీ, దాని ఉపనదుల్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తంగడి మొదలు వడపల్లి వరకు ఉన్న కృష్ణా పరివాహకంలో బీఓడీ స్థాయి 5–నుంచి 7మి.గ్రా/లీ.గా నమోదవ్వగా, మూసీలో అయితే ఏకంగా 4మి.గ్రా/ లీ నుంచి 60మి.గ్రా/లీటర్‌గా ఉంది. కర్నూలు తుంగభద్ర నది ద్వారా ఎగువ నుంచి కాలుష్య రసాయనాలు కృష్ణాలో కలుస్తున్నాయి. దీంతో పాటు కృష్ణా పరివాహకం వెంట ఉన్న కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల, నల్లగొండ వంటి పట్టణాల ద్వారా వస్తున్న మురుగు కారణంగా కృష్ణానది కాలుష్యం బారిన పడుతోంది.
అడ్డుకట్ట ఎలా వేయాలంటే..
నదీజలాలు కలుషితం కాకుండా ఉండాలంటే ఏమేం చేయాలో జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. అవి..
– కాలుష్య నివారణకు పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలను నియంత్రించడంతో పాటు, శుద్ధి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
– ఎక్కువగా మురుగు ఉత్పత్తికి కారణమవుతున్న పట్టణాలు, గ్రామాలను గుర్తించి ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి.
– ఎన్టీపీసీ, టీఎస్‌జెన్‌కోలు ఉన్న ప్రాంతాల్లో కర్మాగారాల నుంచి వెలువడే బూడిద నియంత్రణకు సరైన యాంత్రీకరణ ఉండాలి.
– ప్రతి ఆస్పత్రిలో తక్కువ వ్యయంతో దాని ఆవరణలోనే ఎస్టీపీలు ఏర్పాటు చేయించాలి.
– నది పరీవాహకంలోని పరిశ్రమలన్నీ భూగర్భ జల వనరులశాఖ అనుమతిలేనిదే వ్యర్థాలు విడుదల చేయకుండా జాగ్రత్తలు పాటించాలి.
ప్రక్షాళనకు కేంద్రం చొరవ
దేశవ్యాప్తంగా అత్యంత కలుషితమైనవిగా గుర్తించిన 13 నదుల్లో కృష్ణా, గోదావరి ఉండటంతో గంగానది మాదిరిగా వీటినీ ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా అనంత్ 1, అవిరల్‌ధార, నిర్మల్ ధార పేర్లలో కార్యక్రమాలను చేపట్టిన కేంద్రం, రాష్ట్ర అటవీశాఖ సహకారంతో కృష్ణా, గోదావరి నదుల పునరుజ్జీవానికి ప్రయత్నా లు ముమ్మరం చేసింది. తొలి ప్రయత్నంలో భాగంగా నదుల ప్రస్తుత స్థితి, పరివాహక ప్రాంత పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమైంది.
కృష్ణా, గోదావరి నదులకు 2 వైపులా 5 కి.మీ. మేర, వాటి ఉపనదుల పరిధిలో ఇరువైపులా 2 కి.మీ. మేర మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతోంది. నదీ పరివాహకాల్లో చెట్లు నాట డం, కోతను నియంత్రించడం, ఇసుక తవ్వకాలను నిషేధించడం వంటివి చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment