జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత యథావిధిగానే ఉంది. పాఠశాలలు తెరిచే నాటికి కొత్త ఉపాధ్యాయులు వస్తారనుకున్నా.. వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నిర్వహించినా.. ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఈ విద్యా సంవత్సరం కూడా విద్యా వలంటీర్లతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంది. విద్యా సంవత్సరం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న 1,211 ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసే విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత ఏడాది పలుచోట్ల ప్రధానోపాధ్యాయులతోపాటు ఆయా సబ్జెక్టుల టీచర్లు లేకపోవడంతో ఫలితాల్లో వెనుకబడాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆ ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడింది. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు అనేక ప్రభుత్వ
ఉన్నత పాఠశాలల్లో ఏళ్లతరబడి ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడం, ఆయా పాఠశాలల విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టులను బోధించే పూర్తిస్థాయి ఉపాధ్యాయులు లేకపోవడమే పదో తరగతి ఫలితాలు తగ్గడానికి కారణమైందని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆయా పోస్టులను భర్తీ చేయాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కావడంతో విద్యార్థులకు విద్యాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఖాళీలివే..
జిల్లావ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలుపుకుని 586 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఎస్‌జీటీలు 208, సోషల్ 117, బయాలజీ 52 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉంది. అలాగే గ్రేడ్–2 హెచ్‌ఎంలు 36, గణితం 21, ఫిజిక్స్ 3, ఇంగ్లిష్ 20, తెలుగు 30, హిందీ 11, ఉర్దూ 2, పీడీ, పీఈటీ పోస్టులు 13, లాంగ్వేజి పండిట్ తెలుగు 11, లాంగ్వేజి పండిట్ హిందీ 7, పీడీఎం పోస్టులు 15, ఎల్‌ఎఫ్‌ఎల్ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి.
ఒకే ఉపాధ్యాయుడు.. రెండు పాఠశాలలు..
జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యా వలంటీర్లను నియమించి పాఠాలు చెప్పించినప్పటికీ సరైన ఫలితం కనిపించలేదు. మరికొన్నిచోట్ల ఒకే సబ్జెక్టు బోధిస్తున్న ఉపాధ్యాయుడు తన లీజర్(ఖాళీ) సమయంలో మరో పాఠశాలకు వెళ్లి అదే సబ్జెక్టును బోధించారు. ఒకే ఉపాధ్యాయుడు రెండు చోట్లకు వెళ్లడంతో అక్కడ కూడా సరైన ఫలితాలు రాబట్టలేకపోయారు. ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాలకే పరిమితమైతే ఫలితాలు బాగా వస్తాయని పేర్కొంటున్నారు. కానీ.. దానిని ఆచరణలో చూపడం లేదు. అనుభవం లేని విద్యా వలంటీర్లను వివిధ పాఠశాలల్లో నియమిస్తూ ఫలితాలు అందుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఖాళీలున్న పాఠశాలల్లో ఎస్‌జీటీ తదితర పోస్టులను భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
ఈ ఏడాదీ వీవీలే..
విద్యా సంవత్సరం పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటివరకు ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు సంబంధించి విద్యా వలంటీర్లను నియమించే అవకాశం ఉంది. ఆ దశగా విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉంటే అందుకు తగిన రీతిలో బోధన జరిగే వీలుంటుంది. అలా కాకుండా విద్యా వలంటీర్లను నియమించడంతో విద్యార్థులు కూడా ఆయా సబ్జెక్టులపై అంతగా శ్రద్ధ చూపరని పలువురు పేర్కొంటున్నారు.
ఆదేశాలు రాలేదు..
జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఇతర పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అప్పటివరకు గతంలో మాదిరిగానే విద్యా వలంటీర్లతోపాటు ఉన్న ఉపాధ్యాయులను ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేసి విద్యాబోధన కొనసాగిస్తాం. గతంలో ఈ వ్యవహారంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. అటువంటివి పునరావృతం కాకుండా ఈ ఏడాది పకడ్బందీ చర్యలు చేపట్టాం. – మదన్‌మోహన్, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment