ఆసరాతో భరోసా... ఆడుతూ..పాడుతూ.. బీడీలు చుడుతూ..! | The Government's 'Supporting' Provisions For Beedi Workers Are Giving Aasara Pension Scheme | Sakshi
Sakshi News home page

ఆసరాతో భరోసా... ఆడుతూ..పాడుతూ.. బీడీలు చుడుతూ..!

Published Sun, Mar 24 2019 7:12 AM | Last Updated on Sun, Mar 24 2019 7:13 AM

The Government's 'Supporting' Provisions For Beedi Workers Are Giving Aasara Pension Scheme - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని బీడీలు చుడితే రోజుకు వచ్చే కూలి రూ.120 దాటదు. బీడీ కంపెనీలు నెలలో కనీసం 15 రోజులు కూడా పనివ్వడం లేదు. ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ బతుకు వెళ్లదీస్తున్న బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ‘ఆసరాపింఛన్లు’ కొంత మేర భరోసా ఇస్తున్నాయి. నెలకు వచ్చే రూ.1,500 నుంచి రూ.2,500కు తోడు ప్రభుత్వం ఇచ్చే భృతి వెయ్యి రూపాయలతో బతుక్కి కొంత భరోసా లభిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బీడీ కార్మికుల సమస్యలు ప్రధానంగా చర్చ కొస్తున్నాయి. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని పార్టీలన్నీ ఇప్పుడు హామీల వర్షం కురిపిస్తున్నాయి. 

రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లో నాలుగు నియోజకవర్గాల్లో బీడీ కార్మికులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో నిర్ణయాత్మక శక్తి వారే. మరో నాలుగు చోట్ల పరోక్ష ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ బీడీ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాయి. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీడీ కార్మికులకు ప్రతి నెలా భృతి ఇస్తూ, వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్‌ సర్కారు పేర్కొంటుండగా, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు కలిస్తూ కార్మికులకు భరోసాగా నిలుస్తున్నామని బీజేపీ చెబుతోంది. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థులు సైతం హామీనిస్తున్నారు. 

రాష్ట్రంలో ఆరు లక్షల మంది
రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికుల్లో అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలోనే ఉన్నారు. సుమారు లక్షన్నర మంది ఇక్కడ ఉండగా, మిగతా వారంతా కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది వరకు బీడీ తయారీతో ఉపాధి పొందుతున్నారు. బీడీ పరిశ్రమ నిజామాబాద్‌తోపాటు, జిల్లాలో విస్తృతంగా ఉంది. నిజామాబాద్‌ నగరంలోనే 40 వరకు బీడీ కంపెనీలున్నాయి. నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల బీడీ కార్మికులున్నారు. ఇక్కడ తయారైన బీడీలు మహారాష్ట్ర, గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. 

జీఓ నం.41 అమలు కోసం ఉద్యమం
తమకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీడీ కార్మికులు దశాబ్దకాలంగా ఉద్యమం చేస్తున్నారు. తరచూ వేలాది మంది రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. వీరి కనీస వేతనాలను పెంచుతూ జీఓ నంబర్‌ 41 జారీ అయ్యింది. ఈ జీఓ ప్రకారం వెయ్యి బీడీలకు రూ.320 చెల్లించాలి. అయితే దీనిని అమలు చేస్తే తమకు పరిశ్రమ నడపడం గిట్టుబాటు కాదని, బీడీ ఉత్పత్తిని నిలిపివేస్తామని యాజమాన్యాలు అంటున్నాయి. కొద్ది రోజులు కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి కూడా. దీంతో జీఓ అమలుకు నోచుకోలేదు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అందేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

జీవన భృతితో 4.08 లక్షల మందికి లబ్ధి
బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా వెయ్యి రూపాయల జీవనభృతిని ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4.08 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రతినెలా వెయ్యి చొప్పున ప్రభుత్వం పింఛన్‌ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఒక్క నిజామాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా 96,557 మంది కార్మికులు ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. అలాగే జగిత్యాల జిల్లాలో 89,558 మంది పింఛన్‌ అందుకుంటున్నారు.

సీఎం హామీపై ఆశలు..
బీడీ కార్మికులకు 2014 లోపు పీఎఫ్‌ సౌకర్యం ఉన్న వారికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయి. ఆ తర్వాత పీఎఫ్‌తో అనుసంధానమైన కార్మికులకు ఈ పింఛను అందడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‘పీఎఫ్‌ ఉన్న కార్మికులందరికీ పింఛను వర్తింపచేస్తా’మని ఇచ్చిన హామీ బీడీ కార్మికుల్లో ఆశలు రేకెత్తించింది. త్వరలోనే ఈ హామీ కార్యరూపం దాల్చుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే అదనంగా మరో లక్షకు పైగా కార్మికులకు ప్రతినెలా భృతి లభించే అవకాశాలున్నాయి.

‘‘కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణలో నాలుగున్నర లక్షల మంది బీడీ కార్మికులుంటే.. దేశ వ్యాప్తంగా 52.32 లక్షల మంది ఉన్నారు. రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కడా ఈ పింఛన్లు ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వాలు బీడీ కార్మికుల బాధలను పట్టించుకోలేదు’’
 ఈ నెల 19న ఎన్నికల ప్రచార బహిరంగసభలో సీఎం కేసీఆర్‌

ఆ భృతితోనే ఇన్ని మెతుకులు తింటున్నా..
బీడీలు చేస్తే నెలకు ఆరేడు వందలు వస్తుండేవి. ఆ డబ్బులు ఇంటి అద్దెకే సరిపోయేవి. తినడానికి సరిపోకపోయేవి. ఏ ఆధారం లేని నన్ను వెయ్యి రూపాయల పింఛన్‌ డబ్బే ఆదుకుంటోంది. బీడీ కార్మికులకు కూలి పెంచేలా చూడాలి. లేకపోతే బతకడమే కష్టమైతది. 
– కరెసూర శ్యామల, బీడీ కార్మికురాలు, నిజామాబాద్‌ జిల్లా

పిల్లల చదువులకు వాడుకుంటున్నాం
నా భర్త ఉపాధి కూలి పనికి వెళ్తాడు, నేను బీడీలు చుడతాను. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరికీ వచ్చే పైసలు కుటుంబ పోషణకే సరిపోతున్నాయి. పిల్లల చదువులకు అప్పు చేయాల్సి వచ్చేది. బీడీ కార్మికులకు ఇచ్చే జీవనభృతి పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. అప్పు చేయాల్సిన పనిలేకుండా పోయింది.
– అంగల రోజా, బీడీ కార్మికురాలు,  నిజామాబాద్‌ జిల్లా

ఇంటి ఖర్చులు వెళ్తున్నాయి..
మాకు ఒక కొడుకు.. భర్త వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. నేను బీడీలు చేస్తాను. ఇద్దరం పనిచేస్తే వచ్చే పైసలు ఇంటి పోషణకే సరిపోతుండేవి. అదనంగా అయ్యే ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చేది. వెయ్యి రూపాయల బీడీ పింఛన్‌ డబ్బులు ఇంటి ఖర్చులకు బాగా ఉపయోగపడుతున్నాయి. 
– పట్నం నాగు, బీడీ కార్మికురాలు, నిజామాబాద్‌ జిల్లా

జీవనభృతి ఆదుకుంటోంది..
బీడీ కార్మికులకు ఇస్తున్న పింఛను డబ్బులు మందులకు ఉపయోగపడుతున్నాయి. ఒక్కదాన్నే బతుకుతున్నాను. ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. బీడీలు చేస్తే వచ్చే కూలి గిట్టుబాటు కావడం లేదు. బీడీలు చేసుకొని బతికేటోల్లకు ప్రభుత్వం ఇస్తున్న జీవన భృతే అదుకుంటోంది.
– గట్టు స్వర్ణలత, బీడీ కార్మికురాలు, నిజామాబాద్‌ జిల్లా 

-పాత బాలప్రసాద్‌గుప్త, సాక్షి ప్రతినిధి– నిజామాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement