
సాక్షి, హైదరాబాద్: మానవజాతి సుగుణాల్లో అత్యున్నతమైన త్యాగానికి మొహర్రం ప్రతీక అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. దైవ విశ్వాసంకోసం జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణత్యాగాన్ని ముహర్రం గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. మంచితనం, త్యాగానికి పర్యాయపదం మొహర్రం అన్నారు. ముహర్రంను స్ఫూర్తిగా తీసుకుని ఇస్లాంకు మూలమైన మానవతావాదానికి పునరంకితమవుదామని గవర్నర్ పిలుపునిచ్చారు.
త్యాగనిరతికి పునరంకితం కావాలి: కేసీఆర్
ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మొహర్రంను స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీ, సత్ప్రవర్తన, న్యాయం, మానవత్వం, త్యాగనిరతికి ప్రతి ఒక్క రూ పునరంకితం కావాలని సీఎం తన సందేశంలో కోరారు.