గణతంత్ర దినోత్సవంలో గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతే ధ్యేయంగా మానవీయ విలువలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ నరసింహన్ శుక్రవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఎందరివో ఆశయాలు, ఆకాంక్షల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మూడున్నరేళ్ల కిందట ఇదే వేదిక నుంచి గణతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చాను. ప్రగతి పయనంలో తెలంగాణ రాష్ట్రం సవాళ్లను, అడ్డంకులను అధిగమిస్తుందని చెప్పాను.
ఇప్పుడు సంతోషంగా, గర్వంగా ప్రకటిస్తున్నాను. ప్రజలు ఆశించినదానికంటే మిన్నగా తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించింది. మనం గమ్యంగా భావిస్తున్న బంగారు తెలంగాణ సాధన త్వరలోనే సాకారమవుతుంది’’ అని నరసింహన్ తెలిపారు. ప్రజల సంక్షేమం విషయంలో రాజీలేని విధంగా తన ప్రభుత్వం వ్యవహరిస్తోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం బృహత్తరమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏటా రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తిలో అనూహ్య పురోగతి...
కరెంటు సరఫరా విషయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 6,574 మెగా వాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 14,845 మెగావాట్లకు చేరిందని, 28 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కొన సాగుతోందన్నారు. ‘‘నా ప్రభుత్వ సరైన విధానం, వ్యూహం, ఉద్యోగుల అంకితభావమైన విధి నిర్వహణతో రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కరెంటు కోతలు లేకుండా చేశాం. 2018 జనవరి ఒకటి నుంచి నాణ్యమైన కరెంటును వ్యవసాయానికి ఉచితంగా నిరంతరం సరఫరా చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాం.’’ అని గవర్నర్ చెప్పారు.
బీసీలకు తోడ్పాటు...
మానవ వనరులను పూర్తిస్థాయిలో, సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, రూ. 5 వేల కోట్లతో 75 శాతం సబ్సిడీపై యాదవ, కురుమలకు మేకలు, గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించామని గవర్నర్ తెలిపారు. 1.50 కోట్ల గొర్రెలను 7.61 లక్షల మంది యాదవ, కుర్మలకు పంపిణీ చేయనున్నామని, ఇప్పటికే 40 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులు, నాయీ బ్రాహ్మ ణులు, రజకులు, గీత కార్మికులు, విశ్వబ్రాహ్మణుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
కేజీ టు పీజీకి అడుగులు
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించే దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 542 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యా యన్నారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాల మార్పిడికి చర్యలు తీసుకుంటోందని గవర్నర్ వివరించారు. ప్రభుత్వ ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన పెరిగిందని, టీఎస్ ఐపాస్‌తో ఇప్పటికే 6,070 పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని, కొత్త పరిశ్రమలతో ఇప్పటికే 1.18 లక్షల కోట్ల పెట్టుబడులు, రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
లాభసాటి వ్యవసాయానికి చర్యలు..
వ్యవసాయం, సంప్రదాయ వృత్తులను లాభసాటిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సాగును లాభ సాటిగా మార్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. 2018–19 నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని చెప్పారు. రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం రెండు సీజన్లలో కలిపి ఎకరానికి రూ. 8 వేల చొప్పున ఇవ్వనున్నామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని, సాగునీటిశాఖకు ప్రతి ఏటా రూ. 25 వేల కోట్లను కేటాయిస్తోందని గవర్నర్ తెలిపారు. అసలైన భూ యజమానులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. మొదటి దశ కింది గ్రామీణ ప్రాం తాల్లోని భూరికార్డుల ప్రక్షాళన పూర్తయ్యిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment