
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ సునీత తదితరులు
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం సం దర్శించారు. ఉదయం 11గంటలకు యాదాద్రి కొండపైకి చేరుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు 11.02 గంటలకు బాలాలయానికి చేరుకున్నారు. బాలాలయం ప్రధాన ద్వారం వద్ద ఆల య ఆచార్యులు పూర్ణకుంభంతో సంప్రదాయంగా వారికి స్వాగతం పలికారు. ప్రతిష్టామూర్తులకు గవర్నర్ తమిళిసై దంపతులు విశేషంగా పూజలు నిర్వహించారు. సుమారు 19నిమిషాల పాటు పూజలు చేశారు. అనంతరం మహా మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ ఆచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు.
గవర్నర్‌కు ఘన స్వాగతం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ అనితారాంచంద్రన్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘన స్వాగతం ఫలికారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం పలకగా.. కలెక్టర్ అనితరాంచంద్రన్ మొక్కను అందజేశారు. అంతకు ముందు గవర్నర్ తమిళిసై పర్యటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఆలయ అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు.
ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విప్ సునీత
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అనుకున్న సమయానికి ఆలయానికి రాలేదు. గవర్నర్ దంపతులు క్షేత్రంలోకి వెళ్తున్న సమయంలో ఐదు నిమిషాలు ఆలస్యంగా విప్ సునిత వచ్చారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్తున్న తొందరలో తన కాళ్లకు ధరించిన షూ ఆలయానికి వెళ్లే దారిలోని మెట్లపై వదిలి వెళ్లారు. వాటిపై భక్తుల్లో చర్చ జరిగింది.
కావాలని షూతో మెట్లు ఎక్కలేదు
శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వచ్చిన హడావుడిలో అనుకోకుండా షూతో ఐదు మెట్లు ఎక్కానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలని షూతో మెట్లు ఎక్కలేదని తెలిపారు.