ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించింది 7,8 తేదీల్లో జిల్లాకు కేంద్ర బృందం
నీటి ఎద్దడి నివారణకు రూ.17 కోట్లతో కార్యాచరణ మరుగుదొడ్ల నిర్మాణంలో సిద్దిపేట టాప్
విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెల్లడి. ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించింది
7,8 తేదీల్లో జిల్లాకు కేంద్ర బృందం విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెల్లడి
మెదక్: ప్రభుత్వం జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించినందున రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. శుక్రవారం ఆయన మెదక్ పట్టణానికి వచ్చిన సందర్భంగా ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. కరువు వల్ల నష్టపోయిన పంటలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు రైతుల వారీగా వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. రబీలో కేవలం ఆరుతడి పంటలే సాగుచేయాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. మంజీర నదిలో అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్లను తొలగించిన ట్టు చెప్పారు. పశువుల దాహార్తిని తీర్చడానికి ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. కరువును పరిశీలించేందుకు ఈనెల 7,8 తేదీల్లో కేంద్ర బృందం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. కరువు వల్ల దెబ్బతిన్న పంటలను ప్రత్యక్షంగా పరిశీలించి కేంద్రానికి నివేదిక అందజేస్తారన్నారు.
జిల్లాలో 62 వేల మందికి ఉపాధి పనులు..
కరువు దృష్ట్యా ఉపాధి పథకం పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో 62 వేల మంది కూలీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం లో రాష్ట్రంలో మన జిల్లానే ముందంజలో ఉందన్నారు. కొన్ని చోట్ల చెరుకు నరకడంతోపాటు వ్యవసాయ పనులు జరుగుతున్నందున ఉపాధిపనులు మొదలు పెట్టలేదన్నారు.
మంజీర జలాలు నగరానికి బంద్..
జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతోపాటు ప్రధాన నీటి ప్రాజెక్టుల్లో సైతం నీటి నిల్వలు తగ్గాయన్నారు. తాగు నీటికోసం రూ.17 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, మంజూరు కాగానే చర్యలు చేపడతామన్నారు. మంజీర నీటిని హైదరాబాద్‌కు తరలించడం లేదన్నారు. సంగారెడ్డితోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో తాగునీటికోసం వెచ్చించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ నాలా నుంచి పైప్‌లైన్ వేసి జిల్లాలో తాగునీటి ఎద్దడి తీరుస్తామని కలెక్టర్ తెలిపారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఐదున్నర కోట్ల మొక్కల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం అదనంగా 300 నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు.
సిద్దిపేట ముందంజ...
వచ్చే ఏడాది అక్టోబర్ వరకు జిల్లాలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మింపజేస్తామని కలెక్టర్ చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో సిద్దిపేట ముందంజలో ఉందన్నారు. మురికి నీరు రోడ్లపై పారకుండా ఉండేందుకు ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, ఇందుకు ఇబ్రహీంపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారికి డబ్బులు అందలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ డబ్బుల పంపిణీలో ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం అందరికి డబ్బులు అందజేస్తున్నట్టు చెప్పారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు : కలెక్టర్
అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అక్రమ లేఅవుట్లపై ఈనెల 1న ‘గుట్టలు చీల్చుతూ ప్లాట్లు చేస్తూ’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన మున్సిపల్ అధికారులు ఈనెల 3న అక్రమ లేఅవుట్లను పరిశీలించి, పనులు నిలిపివేశారు. విషయాన్ని సైతం సాక్షి ఎఫెక్ట్‌గా ‘కదిలిన మున్సిపల్ అధికారులు’ అనే కథనాన్ని శుక్రవారం ప్రచురితం చేసింది. మెదక్‌లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా కలెక్టర్ అక్రమ లేఅవుట్లపై స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతన్నను ఆదుకుంటాం
Published Sat, Dec 5 2015 12:34 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement
Advertisement