
సర్కారు వారి గ‘లీజు’ నిద్ర..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన మార్గంపై ఉన్న స్థలమది.. దాని విలువ రూ.కోట్లలోనే ఉంటుంది..
► గడువు దాటిన 45 ఏళ్ల తర్వాత మేల్కొన్న యంత్రాంగం
► మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు కదిలించాక హడావుడి
► ఖాళీ చేయాలంటూ లీజు సంస్థకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన మార్గంపై ఉన్న స్థలమది.. దాని విలువ రూ.కోట్లలోనే ఉంటుంది.. దాదాపు 7 దశాబ్దాల క్రితం ప్రభుత్వం దాన్ని లీజుపై ఓ సంస్థకు కేటాయించింది. లీజు గడువు తీరి నాలుగున్నర దశాబ్దాలు దాటిం ది.. కానీ విషయాన్ని ప్రభుత్వం ఏనాడో మర్చిపోయింది. ఆ స్థలంవైపు కన్నెత్తయినా చూడలేదు.. ఇటీవల తన పనులకు ఆ స్థలం అవసరం రావటంతో మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు కదిలిస్తే అప్పుడు ప్రభుత్వం మొద్దునిద్ర నుంచి మేల్కొంది. ప్రభుత్వ స్థలాలు ఎందుకు సులభంగా అన్యాక్రాంతమవుతాయో తెలిపేం దుకు నిదర్శనమిది.
మొద్దునిద్ర నుంచి దశాబ్దాల తర్వాత మేల్కొన్న యంత్రాంగం ఇప్పు డా స్థలాన్ని తెగనమ్మి సొమ్ము చేసుకునే పనిలో పడింది. వివిధ పనులపై నగరానికి వచ్చే పేదలకు ఉచితంగా బస చేసేందుకు వినియోగించాల్సిన స్థలమదన్న విషయాన్ని కూడా ప్రభుత్వం మరిచిపోయింది. ప్రభుత్వం పట్టించుకోకపోయినా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఓ సంస్థ నిర్వహిస్తున్న ‘ధర్మశాల’ కథ ఇది..!!
తెలంగాణలో అతిపెద్ద ఆస్పత్రిగా ఖ్యాతికెక్కిన గాంధీ వైద్యశాలకు దూరప్రాంతాల నుంచి పేదలెందరో వైద్యం కోసం వస్తుంటారు. దాదాపు 75 ఏళ్ల క్రితం అదే అతిపెద్ద ఆస్పత్రి. చికి త్స కోసం వచ్చే పేదల కుటుంబ సభ్యులు నగరంలో బస చేసేందుకు ఇబ్బంది పడుతుండటంతో అప్పటి ప్రభుత్వం ఓ ధర్మశాలను నిర్మించాలని నిర్ణయించింది. అదే ఉద్దేశంతో ఉన్న ఓ సంస్థకు ఆ బాధ్యత అప్పగిస్తూ ఆస్పత్రికి చేరువలో దాదాపు 1,500 గజాల స్థలాన్ని లీజుకు కేటాయించింది.
దీంతో అక్కడ ధర్మశాల రూపుదిద్దుకుంది. 1950ల్లో అది దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లడంతో దాని నిర్వహణ కోసం ఆ శాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. సికింద్రాబాద్ స్టేషన్ పక్కన ఆస్పత్రి ఉన్నంత కాలం ఇది లక్ష్యం దిశలోనే పయనించింది. తర్వాత గాంధీ ఆస్పత్రిని అక్కడి నుంచి తరలించటంతో రోగుల కుటుంబ సభ్యుల రాక తగ్గిపోయింది. భవనం పాతబడిపోవటంతో దాని నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది. ఇలా చూస్తుండగానే దశాబ్దాలు దొర్లిపోయాయి. అది ఎప్పుడు కబ్జాకు గురవుతుందో తెలియని పరిస్థితి నెలకొనటంతో..
అది పేదలకు ఉపయోగపడాల్సిన లీజు స్థలమని, ఎవరైనా వాణిజ్య అవసరాలకు అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ ఓ బోర్డును ఏర్పాటు చేసింది. అయినా అది స్వాహా అవుతుందేమోనన్న భయం నెలకొనటంతో పాత భవనం కూల్చి రెండంతస్తులతో కొత్త భవనం నిర్మించి పేద ప్రజలకు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఉచితంగా ఇవ్వటం, వివిధ అవసరాల కోసం నగరానికి వచ్చే నిరుపేదలకు ఉచితంగా గదులు కేటాయించాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
మెట్రో రైలు పనులతో...
ఇటీవల ఆ దారిలో మెట్రో రైలు పనులు చేపట్టాల్సి వ చ్చింది. అందుకోసం ఈ ధర్మశాలకు చెందిన దాదాపు 500 గజాల స్థలం సేకరించాల్సి వచ్చింది. అందుకు పరిహారం మొత్తంగా రూ.4.90 కోట్లను ఖరారు చేశారు. దాన్ని ఎవరికి చెల్లించాలనే ప్రయత్నంలో మెట్రో రైలు అధికారులు వాకబు చేయటంతో అప్పటి వరకు దాని గురించే మరిచిపోయిన రెవెన్యూ శాఖకు మెలకువ వచ్చింది. అది ప్రభుత్వ స్థలమని, ఆ పరిహారాన్ని రెవెన్యూ శాఖకే చెల్లించాలని కోరటంతోపాటు, మిగతా స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి ఆదాయం పొందాలని భావించింది.
ఆ పరిహారం విషయంలో ఆ సంస్థ ఫౌండర్ ట్రస్టీ కుటుంబ సభ్యులతో వివాదం చెలరేగటంతో పరిహారం మొత్తాన్ని కోర్డులో డిపాజిట్ చేశారు. హడావుడిగా రికార్డులు తిరగేసిన రెవెన్యూ అధికారులు.. లీజు గడువు 1967లోనే ముగిసిందని గుర్తించి నాలుక్కరుచుకుని, దాన్ని ఖాళీ చేయాల్సిందిగా లీజుదారైన ఆ సంస్థ ఫౌండర్ ట్రస్టీ కుటుంబ సభ్యులకు నోటీసు జారీ చేశారు. వారు ఖాళీ చేయగానే దాన్ని వాణిజ్య అవసరాలకు వీలుగా అభివృద్ధి చేయటమో, అమ్మేయటమో చేయాలనేది రెవెన్యూ శాఖ ఆలోచన. పేద ప్రజలకు ఉపయోగపడే సదుద్దేశంతో నాటి ప్రభుత్వం దాన్ని కేటాయించిందని, ఇప్పుడు కూడా పేదలకు ఉపయోగపడేలా తాము ప్రణాళిక సిద్ధం చేసినందున దాన్ని దేవాదాయ శాఖకే కేటాయించాలని ఆ శాఖ కమిషనర్ తాజాగా సీసీఎల్‌ఏకు లేఖ రాశారు.