నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించక పోవడం,నాణ్యత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం ప్రధానంగా మారింది. స్థానికంగా ప్రజాప్రతినిధుల చొరవ కూడా కరువైంది. వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది.
ఇదీ పరిస్థితి.....
విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రవేశాల పెంపునకు ప్రభుత్వ పాఠశాలల్లో 15 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు వేసవి సెలవులలోనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి ముగుస్తున్నాయి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకంగా మారింది. నిబంధనల ప్రకారం అన్ని పాఠశాలల్లో ప్రవేశాలు ఒకేసారి జరిగాలి.
ఇది సక్రమంగా అమలు కావడం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సెలవులలో ఊరూర తిరుగుతూ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. తక్కువ ఫీజులు, నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించడం లేదు. మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 2162 ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం కోట్లాది రూపాయలను పాఠశాలలకు కేటాయిస్తోంది. కాని పాఠశాలల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, ఉన్న చోట సక్రమంగా విద్య అందకపోవడంతో ప్రభుత్వ ఆశయానికి గండికొడుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారింది.
ప్రజాప్రతినిధులు మేలుకొనాలి
స్థానికంగా ప్రజాప్రతినిధులు మేలుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యక్రమం చేపట్టాలి. గత ఏడాది భీంగల్ మండలం చేంగల్ ప్రభుత్వ పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల 150 మంది విద్యార్థులకు చేరింది. స్థానిక గ్రామ కమిటీ, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలనే సంకల్పంతో ఇది సాధ్యమైంది. ప్రతి చోట ఈ విధానం అమలు అయితే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడతాయి. కాగా చాలాచోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యవైఖరి కొనసాగుతోంది.
పాఠశాలల్లో విద్యార్థుల పెంపునకు పట్టింపులేకపోవడం, పాఠశాల విద్యాబోధనకు సంబంధించి టీచర్లు సమయపాలన పాటించకపోవడం రుగ్మతగా మారాయి. మధ్యాహ్నం భోజనం సైతం పట్టించుకునేవారే కరువయ్యారు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది. మండల, జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడటం లేదు.
ప్రైవేట్ పాఠశాలలకు ముకుతాడు వేయాలి.
ఒక వైపు ప్రైవేట్ పాఠశాలల జోరుకు జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణం. ప్రైవేట్ పాఠశాలలు నెలకొల్పాలంటే జీవో నం.1 ప్రకారం నియమ నిబంధనల పాటించిన వాటికే అనుమతి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల అమలు కావడం లేదు. ఆటస్థలం, సౌకర్యాలు లేని ప్రైవేట్ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. వీటిని సైతం అధికారులు తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వేసవి కాలం సెలవుల్లోనే ఆడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వీటిని నియంత్రిస్తేనే ప్రభుత్వ పాఠశాలలకు మేలు జరుగుతుంది.
స్థానికంగా ప్రజాప్రతినిధులు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించలేకపోతున్నారు. పాఠశాల విద్యాబోధనకు సంబంధించి పరిశీలన చేపట్టడం లేదు. టీచర్ల సమయ పాలనను ప్రశ్నించడం లేదు. ఇలాగైతే ఎలా ? ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులను చేర్పించే బాధ్యత చేపట్టాలి.
- జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులను ఉద్దేశించి కలెక్టర్ యోగితారాణా వ్యాఖ్యలు
ప్రైవేటు జోరు.. సర్కారు బేజారు
Published Sun, Feb 28 2016 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement
Advertisement