తూప్రాన్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఐకేపీ ద్వారా ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ శరత్ తెలిపారు. తూప్రాన్ మండలం యావపూర్‌లో గురువారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్‌డీఎ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని కేసీఆర్ అడిగినట్లు జేసీ తెలిపారు.
అయితే గత ఏడాది గజ్వేల్ కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యం విషయంలో కొంత గొడవ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమైక్య సంఘాల వారు ముందుకు రాని కారణంగా జాప్యం నెలకొందని తెలిపారు. వెంటనే నియోజకవర్గంలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 94 కొనుగోలు కేంద్రాల ద్వారా 23 వేల మేట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని నాణ్యమైనదిగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వల్ల మిల్లర్లకు చెక్ పెట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.1345 ధర కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు 72 గంటల్లో తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.
అయితే బ్యాంకుల్లో జమ అయిన డబ్బులను బ్యాంకు అధికారులు రైతుల రుణాలకు మళ్లించినట్లయితే బ్యాంకు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐకేపీ మహిళలకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినందుకు వందకు రూ.2.5 శాతం కమిషన్ వస్తోందన్నారు. ఇందుకోసం మహిళలు జాగ్రత్తగా ధాన్యాన్ని సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ స్వామి, డిప్యూటీ తహశీల్దార్ కిషన్, ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఆర్‌ఐలు సంతోష్‌కుమార్, నర్పింహారెడ్డి, సర్పంచ్ గోరీబీ, గ్రామ సమైక్య సంఘం మహిళలు నర్మద, రేణుక, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
Published Fri, May 23 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement