ఆదిలాబాద్ అర్బన్ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు పదవీ చేపట్టి శనివారంతో ఏడాది పూర్తి అయ్యింది. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు గతేడాది జూన్, జూలై నెలల్లో ఆరు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 2, 2013న కొత్తగా గెలుపొందిన వారు సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్, సార్వత్రిక, స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇంతలోనే ఏడాది గడిచింది.
కొత్త ప్రభుత్వం జూన్ 2న కొలువుదీరింది. కానీ, ఏడాది గడుస్తున్నా సర్పంచ్‌లకు రావాల్సిన గౌరవ వేతనాలు రాలేదు. వస్తాయో.. రావో కూడా తెలియని పరిస్థితి. వేతనాలు చెల్లించాలని, పంచాయతీ అభివృద్ధికి రావాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తే అభివృద్ధికి దోహదపడుతుందని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
హామీల అమలులో విఫలం
పంచాయతీలను అభివృద్ధి చెందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని పలువురు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. సాధారణ ఎన్నికలకు పది నెలల ముందే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కొత్త సర్పంచ్‌లు పదవీ చేపట్టినా నిధుల విడుదల జాప్యం జరిగింది. దీంతో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్పంచ్‌లు విఫలమయ్యారు. దీనికి కారణం.. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడమే.
అయితే కొందరు సర్పంచ్‌లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తమ సొంత ఖర్చులతో గ్రామాల్లో బోర్‌వెల్‌లకు మరమ్మతులు, డ్రెయినేజీల పూడికతీత లాంటి చిన్న చిన్న పనులు చేయించుకుంటూ వచ్చారు. మొదటి సారిగా మే 17, 2014న జిల్లాకు రూ.19.36 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు సర్పంచ్‌లకు పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి.
వీటిని ఆయా గ్రామ పంచాయతీ జనాభా ప్రతిపాదికన విడుదల చేసేందుకు మరో నెల సమయం పట్టింది. ప్రస్తుతం గ్రామాలకు అభివృద్ధి నిధులు వచ్చి నెల రోజులు అవుతుందన్న మాట. అంటే ఏడాదిలో ప్రభుత్వం ఒక్కసారే అభివృద్ధి నిధులు విడుదల చేసింది. ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీధిదీపాలు లేక అంధకారంలో మగ్గుతున్నాయి. డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయి. అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు.
రావాల్సిన వేతనాలు రూ.48.29 లక్షలు
జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ సర్పంచ్‌గా పదవీ చేపట్టి ఏడాది గడుస్తున్నా సర్పంచ్‌లకు రావాల్సిన గౌరవ వేతనం రాలేదు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు రూ.1,500, మైనర్ జీపీ సర్పంచ్‌లకు రూ.1000 ప్రతి నెల వేతనంగా ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో సగం ప్రభుత్వం చెల్లిస్తే మిగతా సగం జీపీ నుంచి పొందాల్సి ఉంటుంది.
ఏడాదిలో 11 నెలలకు సంబంధించిన వేతనాలు రూ.48.29 లక్షలు ప్రభుత్వం నుంచి సర్పంచ్‌లకు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏడాదిలో ఒక్కసారే పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే.. సర్పంచ్‌లకు ఒకే నెలకు సంబంధించిన వేతనం ఇవ్వడం శోచనీయం. కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.
‘సర్పంచ్’లుగాఏడాది
Published Sat, Aug 2 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement