పోరాటయోధుడు కేసీఆర్ | grand birthday celebrations of kcr | Sakshi
Sakshi News home page

పోరాటయోధుడు కేసీఆర్

Published Wed, Feb 18 2015 1:06 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM

grand birthday celebrations of kcr

గజ్వేల్ : ‘బంగారు తెలంగాణ’ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కొనియాడారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం గజ్వేల్ మండలం ఆహ్మాదీపూర్ గ్రామంలో టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మా దాసు శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తర్వాత గజ్వేల్ నగర పంచాయతీ ప్రజ్ఞాపూర్‌లోగల ఆశాజ్యోతి ఎయిడ్స్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్‌లో హెచ్‌ఐవీ బాధిత చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 ఏళ్ల ఉద్యమంతో ఆంధ్ర పాలన నుంచి విముక్తిని తీసుకువచ్చిన పోరాట యోదుడు కేసీఆర్ అని అభివర్ణించారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, స ంక్షేమం రెండు కళ్లల్లా ముందుకు నడుపుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడానికి శ్రమిస్తున్నారని ప్రశంసించారు.

ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోరిక తీరుస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్ చూడాలనే ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోరికను తీరుస్తామని, త్వరలోనే ఇక్కడినుంచి వారిని బస్సులో సీఎం వద్దకు తీసుకెళ్లి సీఎంను కలిసేలా చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎయిడ్స్ బారిన పడిన పిల్లలు తాము కేసీఆర్ సార్‌ను చూడాలని ఉందన్న కోరికను ఇటీవల పత్రికల ద్వారా తమ మనసులో మాటను వెల్లడించిన సంగతి తెల్సిందే. మంగళవారం కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌కు ఈ విషయాన్ని తెలియజేయగా ఆమె పైవిధంగా స్పందించారు.

ఎయిడ్స్ బాధిత చిన్నారుల మధ్య నిర్వహించిన కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో తను పాల్గొనడడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్,  టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మడుపు భూంరెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీ యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మద్ది రాజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆకుల దేవేందర్, బెండ మధు, ఆహ్మదీపూర్ సర్పంచ్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రక్తదాన శిబిరంతో 61 మంది యువకులు 61 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

మెదక్ టౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిలు కేక్‌ను కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందించే సుపరిపాలన నాలుగు కాలాల పాటు ఉంటుందని వారు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రపంచంలోనే తెలంగాణను మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
 
 సీఎం బాగుండాలని కోరుతూ ‘గుట్ట’కు పాదయాత్ర
 
జగదేవ్‌పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లగా ఉండాలి.. తెలంగాణ ప్రజలు మురిసేలా అభివృద్ధి జరగాలి.. ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతూ మంగళవారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి టీఆర్‌ఎస్ నాయకులు గ్రామం నుంచి నల్గొండ జిల్లా యాదగిరిగుట్టకు పాదయాత్రగా బయలుదేరారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ యాదగిరిగుట్టకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని సర్పంచ్ భాగ్య తెలిపారు. ఎర్రవల్లి నుంచి ఇటిక్యాల, జగదేవ్‌పూర్, పీర్లపల్లి మీదుగా 12 మంది గల బృందం యాదగిరిగుట్టకు బయలు దేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement