ఆమ్రపాలి గ్రీన్ ఛాలెంజ్
సాక్షి, వరంగల్ రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రీన్ చాలెంజ్ జోరుగా సాగుతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. దీంతో జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊపందుకుంది.
గ్రీన్ చాలెంజ్ నేపథ్యమిదే..
తెలంగాణ ఇగ్నైటింగ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ బాధ్యులు ఒకరు మూడు మొక్కలు నాటి మూడేళ్లపాటు కాపాడాలని, మొక్కలు నాటగానే మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసరాలనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరా హైతో భరా హై (పచ్చదనం నిండి ఉంటే భూ మాత నిండుకుండలా ఉంటుంది. అలా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ కడుపు నిండా ఉంటారు అని అర్థం) అనే నినాదంతో ఈ గ్రీన్ చాలెంజ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,00,060 మంది గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి 18,05,876 మొక్కలు నాటారు.
ఎలా భాగస్వాములు కావాలంటే..
www.ingnitingminds.co.in వెబ్‌సైట్ ద్వారా ముందుగా రిజిస్టర్ అయిన తర్వాత మూడు మొక్కలు నాటి వాటి గురించి స్క్రిప్ట్ రాయాలి. తర్వాత సెల్ఫీ దిగి ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. అలాగే ఎవరికి సవాల్ విసురుతున్నారో వారి ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్, వాట్సప్ ఫోన్ నంబర్‌ను అప్‌లోడ్ చేస్తే నేరుగా వారికి వెళ్తుంది. ముందుగా మూడు మొక్కలునాటి మూడేళ్లపాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటానని ప్రతిజ్ఞ చేయాలి.
నాటిన మొక్కలతో సెల్ఫీ దిగి ఎవరికైతే సవాల్ విసురుతున్నారో వారికి షేర్ చేయాలి. సవాల్‌ను స్వీకరించి 10 రోజుల్లో మొక్కలు నాటేందుకు ముందుకు రాకపోతే ఓడిపోయినట్లు అవుతుంది. ఇలా సాధారణ వ్యక్తి నుంచి అన్ని స్థాయిలవారు గ్రీన్ చాలెంజ్ పేరుతో సెల్ఫీ దిగి మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. ఎక్కడ చూసినా గ్రీన్ చాలెంజ్‌ల చర్చనే సాగుతోంది. జిల్లాలో యువత సైతం మొక్కలు నాటి వారి స్నేహితులకు గ్రీన్ చాలెంజ్‌ను విసురుతున్నారు.
గొలుసు కట్టుగా..
జిల్లాలో మొక్కలు నాటడం గొలుసుకట్టుగా సాగుతోంది. గ్రీన్ చాలెంజ్ సవాళ్లను స్వీకరించి మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్‌ను విసురుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాధారణ వ్యక్తులు సైతం గ్రీన్ చాలెంజ్ విసురుతున్నారు.
తక్కువ కాలంలో..
ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఐదు జిల్లాల్లో 4.74 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హరితహారంను విజయవంతం చేసేందుకు అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హరితహారంలో పాల్గొనేందుకు జిల్లా యంత్రాంగానికి సైతం బాధ్యతలు అప్పగించారు. గ్రీన్ చాలెంజ్ కొత్తగా ఉండటంతో అనతికాలంలోనే సోషల్ మీడియా ద్వారా మంచి ప్రాచుర్యం పొందింది. ప్రజలు తమ వంతు బాధ్యతగా హరితహారంలో యజ్ఞంలా భాగస్వాములు అవుతున్నారు.
జోరుగా గ్రీన్ సవాల్
జూలై 24న కలెక్టరేట్‌లో కలెక్టర్ ముండ్రాతి హరిత మూడు మొక్కలు నాటి సీపీ రవీందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి గ్రీన్ చాలెంజ్ విసిరారు. జూలై 28న హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మూడు మొక్కలు నాటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు.
ఈ చాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అదే రోజు హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో మొక్కలు నాటి ఉద్యోగ సంఘాల నేతలకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. అంతేగాక డిప్యూటీ సీఎం చాలెంజ్‌తో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ జూలై 30న వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటి వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి ఎంపీపీలు మార్నేని రవీందర్‌రావు, రంగు రజిత కుమార్, సుకన్య రఘుకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.
అలాగే వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన అరూరి మరో మూడు మొక్కలు నాటి వర్ధన్నపేట జెడ్పీటీసీ సారంగపాణి, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, హసన్‌పర్తి జెడ్పీటీసీ సుభాష్‌గౌడ్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన డిప్యూటీ మేయర్ సిరాజోద్దిన్ మొక్కలు నాటి ముగ్గురు కార్పొరేటర్లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.
మహబూబాబాద్‌లో ‘నేను సైతం’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సలీమా మహబూబాబాద్‌లో మూడు మొక్కలు నాటి ఎస్పీ కోటిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపెల్లి రవీందర్‌రావుకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఇటీవల మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మూడు మొక్కలు నాటి కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ నరేష్ నాయక్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు.
కరీంనగర్ జెడ్పీచైర్ పర్సన్ తుల ఉమ గ్రీన్ చాలెంజ్ పిలుపు మేరకు జూలై 30న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని తన స్వగృహంలో మూడు మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటి మరో ముగ్గురు ప్రజాప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, శాసన మండలి సభ్యుడు నారదాసు లక్ష్మ ణరావుకు గ్రీన్ చాలెంజ్‌ను విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment