భావితరాలకు పచ్చదనం అందించాలి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
కోల్‌బెల్ట్ : భావితరాలకు పచ్చదనం అందించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం హారితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. భూపాలపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం మంజూర్‌నగర్ క్వార్టర్స్ ఏరియాలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం సోమవారం హాజరై మొక్కలు నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం పి.సత్తయ్య అధ్యక్షత వహించగా.. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో అడవుల విస్తీర్ణం తగ్గుముఖం పట్టిందని, దీంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మూడేళ్లలో 120 కోట్ల మొక్కలు పెంచాలని, ప్రతి జిల్లాకు ఏటా 4 కోట్లు, నియోజకవర్గానికి 40 లక్షలు, ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశించిందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. ప్రభుత్వం రూ.40వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడానికి రూపకల్పన చేసిందన్నారు. నియోజకవర్గంలోని సుమారు 100 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సింగరేణి సహకారంతో రానున్న మూడు నెలల్లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుందని ప్రకటించారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న మొక్కల పెంపకం కార్యక్రమం పట్ల స్పీకర్ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణ రవి, జెడ్పీటీసీలు మీరాబాయి, పాడి కల్పనాదేవి, ఎంపీపీ రఘుపతిరావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, ఆర్డీఓ మహేందర్‌జీ, డ్వామా పీడీ జగన్, కౌన్సిలర్లు శిరుప అనిల్, ప్రమీల, నారాయణ, రాజవీరు, సింగరేణి అధికారులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, సలీం, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం
పరకాల : జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారంలో పాల్గొనేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం వచ్చారు. మొక్కలు నాటే సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ లేరా ప్రశ్నించారు. వెంటనే దూరంగా ఉన్న ప్రిన్సిపాల్ శేషాచారి డిప్యూటీ సీఎం వద్దకు వచ్చారు. నమస్తే సార్.. నేనే ప్రిన్సిపాల్ అంటూ ముందుకొచ్చారు. నున్వేనా ప్రిన్సిపాల్.. నీ జుట్టు ఏమిటి, నీ డ్రెస్ ఏమిటి.. ప్రిన్సిపాల్ లెక్కన ఉన్నావా అంటూ మందలించారు.
ఎక్కడి నుంచి వస్తావు అని అనగానే.. వరంగల్ నుంచి వస్తానని చెప్పగానే.. ఏం ఇక్కడ ఉండవా అంటూ డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. నోటీసు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ సీరియస్ అన్నారు. ఆ తరువాత ప్రిన్సిపాల్‌తో మొక్కను నాటించి మంచిగా చూసుకోవాలని సూచించారు.