సంసారాల్లో చిచ్చు | Gudumba sales in nalgonda | Sakshi
Sakshi News home page

సంసారాల్లో చిచ్చు

Published Tue, Nov 1 2016 2:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

సంసారాల్లో చిచ్చు - Sakshi

సంసారాల్లో చిచ్చు

నల్లగొండ  : మారుమూల గిరిజన తండాలను సారా కబళించేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ శాఖకు జిల్లాల విభజన తర్వాత మళ్లీ అదే సవాల్ ఎదురైంది. తండాలను లక్ష్యంగా చేసుకుని పెట్రేగిపోతున్న నల్లబెల్లం మాఫియా సరికొత్త పంథాను ఎంచుకుంది. సారా తయారీకి ప్రధాన ముడిసరుకుగా వాడే నల్లబెల్లాన్ని చిన్న చిన్న వాహనాల్లో అక్రమంగా నల్లగొండ జిల్లాకు రవాణా చేస్తున్నారు. శంషాబాద్ జిల్లా (పాత రంగారెడ్డి జిల్లా), మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి మాల్‌కు అక్రమంగా నల్లబెల్లం రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ నిఘా వర్గాలు పసిగట్టాయి. మాల్ కేంద్రంగా చేసుకుని కొండమల్లేపల్లి, దేవరకొండ, చందంపేట మండల కేంద్రాలకు ఆటోలు, కార్లలో నల్లబెల్లాన్ని తరలిస్తున్నారు.
 
 మండల కేంద్రాల నుంచి బైక్‌లపై తండాలకు దొడ్డిదారిన బెల్లం రవాణా జరుగుతున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దీంట్లో స్థానిక ఎక్సైజ్ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టుగా భావించిన నిఘావర్గాలు అదే విషయాన్ని ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినట్లు సమాచారం. దేవరకొండ ఎస్‌హెచ్‌ఓ పరిధిలోని మండలాల్లోనే సారా ఆనవాళ్లు ఎక్కువగా బయటపడ్డాయి. గుంటూరు జిల్లా నుంచి మిర్యాలగూడ, హాలి యా మండలాలకు బెల్లం రవాణా అవుతోంది. రెండు జి ల్లాల సరిహద్దు ప్రాంతంలోని చెక్‌పోస్టులను కన్ను గప్పి అర్ధరాత్రి సమయంలో బెల్లం రవాణా చేస్తున్నారు. అయితే మిర్యాలగూడలో నల్లబెల్లంతో పాటు ఎర్రబెల్లాన్ని ఉపయోగించి సారా తయారు చేస్తున్నట్లు  బయట పడింది.
 
 అధికారుల అప్రమత్తం...
 సారా విక్రయాలను రూపుమాపాలనుకున్న ఎక్సైజ్ శాఖకు గిరిజన తండాల్లో వాటి ఆనవాళ్లు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాల విభజన అనంతరం నల్లగొండ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండో వారంలో జరిగిన ఎస్‌హెచ్‌ఓల సమావేశంలో గుడుంబా విక్రయాల పై వాడీవేడి చర్చజరిగింది. జిల్లాల విభజన తర్వాత మిర్యాలగూడ ఈఎస్ సూర్యాపేట జిల్లాకు వెళ్లిపోవడంతో దాని పరిధిలోని స్టేషన్లు నల్లగొండ  ఈఎస్ పరిధిలోకి వచ్చాయి. పాత మిర్యాలగూడ ఈఎస్ పరిధిలో సారా విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయన్న నిఘావర్గాల సమాచారంతో నల్లగొండలో ప్రత్యేక భే టీ అయ్యారు. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, నాంపల్లి ఎస్‌హెచ్‌ఓల పరిధిలోని మండలాల్లో 47 తండాలను అనుమానిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాలకు నల్లబెల్లం ఎక్కడి నుంచి వస్తుంది...? తండాల వరకు ఎలా చేరుతోంది...? అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించారు. సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని గతేడాది డిసెంబర్ 8న చేసిన ప్రకటనకు కట్టుబడి కొత్త జిల్లాలో కూడా నిఘా పెంచాల్సిన ఆవశ్యకతను చర్చించారు.
 
 త్రిముఖ వ్యూహం....
 ఎక్సైజ్ శాఖ ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని సారా విక్రయాలపై గతంలో అనుసరించిన విధానాన్నే మళ్లీ అమలు చేయాలని నిర్ణయించారు. పోలీస్, రెవెన్యూ శాఖల సహకారంతో ఎక్సైజ్ శాఖ త్రిముఖ వ్యూహాన్ని రచించింది. ఈ మేరకు ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని డీఎస్పీలు, స్థానిక సీఐ, ఎస్‌ఐల సహకారం తీసుకోవాలని చెప్పారు. అలాగే రెవెన్యూ శాఖ తోడ్పాటుతో తండాల్లో సారా లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐలకు సూచించారు. పాత కేసుల్లో ఉన్న వారిని అరెస్ట్ చేసి అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని...తాజాగా వెలుగుచూస్తున్న అక్రమ వ్యవహారాల్లో వారి ప్రమేయం ఉందని రుజువైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
 దాడులు చేయాలని ఆదేశించాం
 తండాల్లో సారా తయారీ, నల్లబెల్లం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ఇటీవల స్టేషన్ల వారీగా సమావేశం నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో సారా విక్రయాలపై దాడులు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు స్థానిక డీఎస్పీలు, సీఐల సహకారం తీసుకోమని ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐలను ఆదేశించాం. వచ్చే డిసెంబర్ నాటికి నల్లగొండ జిల్లాలో సారా లేకుండా చేస్తాం.
 దత్తురాజు గౌడ్, నల్లగొండ ఈఎస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement