దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం | Guntakandla Jagadish Reddy Election Campaign In Tripuraram | Sakshi
Sakshi News home page

దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం

Published Thu, Apr 4 2019 3:13 PM | Last Updated on Thu, Apr 4 2019 3:14 PM

Guntakandla Jagadish Reddy Election Campaign In Tripuraram - Sakshi

మాట్లాడుతున్న నర్సింహారెడ్డి, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే, రోడ్‌ షోకు తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు 

త్రిపురారం (నాగార్జునసాగర్‌) : తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బుధవారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజున పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ బలం రెండు సీట్లేనని, ఆ రెండు సీట్లతో ఒకేఒక్కడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగా లేనిది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కేసీఆర్‌ నాయకత్వం ఎందుకు చేపట్టలేరని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ నేతల మాయమాటలు వినే స్థితిలో ప్రజలు లేరని.. అలాంటి పార్టీని మట్టి కరిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో రైతులకు 24గంటలపాటు ఉచితంగా కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.

రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టింది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేన న్నారు. సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి ఏదో ఒకరకంగా సంక్షేమ ఫలాలను అందించాలనే తపనతో కల్యాణలక్ష్మి, షాద్‌ ముబారక్, ఆసరా పెన్షన్లు, ప్రతి కుటుం బానికి తాగునీరు, ఉచిత కరెంట్‌ ఇలా అనేక రకాల పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. నాగార్జున సాగర్‌లో డెడ్‌ స్టోరేజీ ఉన్నా ఆ నీటిని తోడి పంపులు పెట్టి రైతుల చివరి భూములకు సాగునీరు అందించి ఆదుకుంటామన్నారు. సాగర్‌ నియోజకవర్గంలో లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయకట్టు చివరి భూములకు నీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని నేతలంతా టీఆర్‌ఎస్‌లోకి వచ్చి చేరుతున్నారని అన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు నాయకులే లేరని, అభ్యర్థి మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు.


నేను రాజకీయాలకు కొత్తేమీ కాదు : నర్సింహారెడ్డి
నల్లగొండ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొత్తేమీ కాదని నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. 20 సంవత్సరాల క్రితమే మునుగోడులో ప్రాదేశిక పోరులో నిలిచానన్నారు. ప్రజలకు సేవా చేయడానికి ముందుకు వచ్చానన్నారు. ప్రజలు ఆశీర్వదించి  సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. 


అధిక మెజారిటీతో గెలిపించాలి - ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
అనంతరం నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహాంరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించి రికార్డు సృష్టించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రాంచందర్‌ నాయక్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్, నాయకులు ఎంసీ కోటిరెడ్డి, ధన్‌సింగ్‌నాయక్, మర్ల చంద్రారెడ్డి, దూళిపాల రామచంద్రయ్య, మార్తీ భరత్‌రెడ్డి, అనంతరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, అనుముల నర్సిరెడ్డి, అనుముల రఘుపతిరెడ్డి, పడిశల బుచ్చయ్య, బిట్టు రవికుమార్, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, కామర్ల జానయ్య, కొనకంచి సత్యం, పామోజు వెంకటాచారి, జంగిలి శ్రీనివాస్, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బచ్చు సాంబయ్య ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement