
సాక్షి, హన్మకొండ అర్బన్: రాజకీయ ఉద్ధండులు పోటీచేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ముగ్గురికి మంత్రి పదవులు వరించాయి.1952లో హన్మకొండ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో వరంగల్ పశ్చిమగా మారింది. నియోజక వర్గాల పునర్విభజన సందర్భంగా నియోజక వర్గం పరిధి విషయంలో భౌగోళికంగా మార్పులు వచ్చాయి. అంతకుముందు గ్రామీణ ప్రాంతాలు కలిసి ఉన్న ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని జనాభాతో ఉండేవిధంగా చేశారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉంటాయి. ఈ నియోజకవర్గం మొదటినుంచి జనరల్ స్థానంగా ఉంది.మొదట్లో ఓటర్లు 56,963 మంది1952లో నియోజకవర్గంలో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 56వేల 963 మంది ఓటర్లు ఉన్నారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీకే రెడ్డిపై 6వేల 728 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ప్రస్తుతం 2లక్షల 33వేల 326 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు పీడీఎఫ్ రెండుసార్లు, టీడీపీ, కాంగ్రెస్ చెరో మూడుసార్లు గెలుపొందాయి. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తూ వస్తోంది. 1999లో బీజేపీ అభ్యర్థి «మార్తనేని ధర్మారావు గెలుపొందారు. మొత్తంగా అన్ని పార్టీలను నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. టీఆర్‌ఎస్ నుంచి మొదటిసారి మందాడి సత్యనారాయణరెడ్డి గెలుపొం దారు. దాస్యం వినయ్‌భాస్కర్ 2009, 2010 ఉప ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
మంత్రులుగా ముగ్గురు..
జనరల్ నియోజక వర్గం కావడంతో ఉద్ధండులే పోటీచేసి గెలిచారు. ఈ క్రమంలో ప్రధాని పీవీ నర్సింహారావు తనయుడు పీవీ రంగారావు, టి హయగ్రీవాచారి, దాస్యం ప్రణయ్‌భాస్కర్ రాష్ట్ర మంత్రి వర్గంలో పనిచేశారు.ఈ నియోజకవర్గంలో 1952లో పెండ్యాల రాఘవరావు రాజీనామాతో, 1998లో ప్రణయ్‌భాస్కర్ అకాల మరణంతో, 2010లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వినయ్‌భాస్కర్ రాజీనామాతో మూడుసార్లు ఉప ఎన్నికలు జరిగాయి.
పదవి కోల్పోయిన మందాడి
హన్మకొండ నియోజకవర్గం నుంచి 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన మందాడి సత్యనారాయణరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విఫ్ ధిక్కరించి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేల్లో సత్యనారాయణరెడ్డి ఒకరు. వారి అనర్హత తరువాత కొద్ది రోజులకు సాధారణ ఎన్నికలు ఉండటంతో ఉప ఎన్నికలు జరగలేదు. ఈ నియోజక వర్గం నుంచి ఇప్పటివరకు మహిళా ప్రాతిని థ్యం లేదు. 2014 ఎన్నికల్లో ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.