
తీవ్రంగా గాయపడిన సత్యనారాయణరెడ్డిని పరామర్శిస్తున్న నందమూరి హరికృష్ణ (ఫైల్)
మొయినాబాద్(చేవెళ్ల) వికారాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు మొయినాబాద్ మండలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఉన్న గండిపేట కుటీరం వద్ద నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ఆయన తన తండ్రి నందమూరి తారక రామారావుతో కలిసి వచ్చేవారు. హైదరాబాద్ నగరానికి చేరువలో జంటజలాశయాల చెంత పచ్చని వాతావరణంతో ఉండే ముర్తూజగూడ రెవెన్యూ పరిధిలో హరికృష్ణ తన కొడుకు పేరున 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన సమయంలో ‘తెలుగు విజయం’ పేరుతో మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
దాని పక్కనే గండిపేట చెరువు సమీపంలో నివాసం ఉండేందుకు శాంతి కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే కొనసాగించేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఎన్టీఆర్ కుటీరం కేంద్ర బిందువుగా మారింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులకు కుటీరంలోనే రాజకీయ శిక్షణ ఇచ్చేవారు. ఆ సమయంలో హరికృష్ణ పార్టీ నాయకులతోపాటు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. ఏ కార్యక్రమం జరిగినా తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి ఆయన ఇక్కడికి వచ్చేవారని సీనియర్ నాయకులు తెలిపారు. హరికృష్ణ ఎక్కువగా ఎన్టీఆర్ ప్రచార రథాన్ని నడుపుతూ కుటీరానికి వచ్చేవారని అన్నారు.
ఎన్టీఆర్ పాఠశాలగా.. కుటీరం
ఎన్టీఆర్ మరణం తర్వాత కుటీరం పాఠశాలగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. అయితే, టీడీపీ నిర్వహించే మహానాడును సైతం ఇక్కడే నిర్వహించేవారు. 2009, 2010, 2011, 2013, 2014లో ఎన్టీఆర్ కుటీరంలో నిర్వహించిన మహానాడుల్లో హరికృష్ణ పాల్గొన్నారు.
పదిహేనేళ్ల క్రితం భూమి కొనుగోలు..
హరికృష్ణ తన చిన్న కొడుకు కల్యాణ్‌రామ్ పేరు మీద గతంలో మొయినాబాద్ మండలం ముర్తూజగూడ రెవెన్యూలో 4 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో రాళ్లతో ఉన్న భూమిని చదును చేయించారు. అందులో ఎలాంటి నిర్మాణాలుగాని, పంటలు సాగుగాని చేయకుండా బీడుగానే వదిలేశారు. నాలుగేళ్ల క్రితం 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్దకొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలు మరుసటి రోజు ఇక్కడే నిర్వహించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం చెక్కును కల్యాణ్‌రామ్‌కు అందజేసింది. అయితే, హరికృష్ణ అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. ఇతర కారణాలతో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. హరికృష్ణ మృతితో కుటీరంలో బుధవారం శ్రద్ధాంజలి ఘటించారు.
అనుబంధం మరువలేనిది: పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి
చేవెళ్ల : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధకరమని పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. చేవెళ్లలో ఆయన మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, సినీ హీరోగా నేను ఎక్కువ అనే గర్వం అనేది ఆయనలో ఎప్పుడు కనిపించేది కాదు అన్నారు. అందరితో కలివిడిగా చాలా సాధారణంగా ఉండేవారన్నారు.
తాను దేవునిఎర్రవల్లి సర్పంచ్‌గా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తన గ్రామానికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ నుంచి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కోసం రూ.5లక్షల నిధులను ఇచ్చారన్నారు. టీడీపీలో పనిచేసే సమయంలో చాలా దగ్గర సంబంధం ఉండేదన్నారు. ఇలాంటి నాయకులు ఉండటం చాలా అరుదు అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఆయన మరణం ఆయన కుటుంబానికి, పార్టీకి తీరని లోటన్నారు.
ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వారు : కంజర్ల శేఖర్
నందమూరి హరికృష్ణ మృతిచెందడం బాధాకారం. ఆయన ఎన్టీఆర్ కుటీరానికి వచ్చినప్పుడల్లా స్థానికులు, నాయకులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఎన్టీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు శిక్షణ ఇచ్చేటప్పుడు హరి కృష్ణ సైతం క్రమం తప్పకుండా వచ్చేవారు.
హరికృష్ణ అంత్యక్రియల కోసం స్థల పరిశీలన
వీఐపీలు, సినీ ప్రముఖుల తాకిడి దృష్ట్యా మార్పిడి
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల) : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలను మొదటగా తన వ్యవసాయ పొలంలో నిర్వహించాలని భావించడంతో బుధవారం చేవెళ్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నాగయ్య, టీడీపీ నాయకులు పరిశీలించారు. మొయినాబాద్ మండలంలోని ముర్తూజగూడ రెవెన్యూ పరిధిలో ఉన్న 133 సర్వే నంబర్‌లో హరికృష్ణకు నాలుగెకరాల పొలం ఉంది.
ఆయన ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడ భూమిని కొనుగోలు చేశారు. 2014లో హరికృష్ణ కుమారుడు జానకీరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు అతని అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. తాజాగా హరికృష్ణ మృతి చెందడంతో ఆయన అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలని కుటుంబీకులు మొదటగా నిర్ణయం తీసుకున్నారు. వీఐపీలు, సినీ ప్రముఖులకు తాకిడి, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించాల్సిన అంత్యక్రియల స్థలాన్ని మార్చినట్లు తెలుస్తోంది. చివరకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవిషయాన్ని అధికారులు సైతం ధృవీకరించారు.

ముర్తూజగూడలోని హరికృష్ణ వ్యవసాయ పొలం వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులు

ఎన్టీఆర్ మోడల్ స్కూల్
Comments
Please login to add a commentAdd a comment