
సాక్షి, హైదరాబాద్: రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం జరిగిన రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మూడో పంట కోసం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని, కానీ కరువు కాటకాలతో నిరంతరం ఇబ్బందులు పడుతూ ఒక్క పంటకే గత్యంతరం లేని తెలంగాణకు మాత్రం ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీ య హోదా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్రానికి అన్యాయం చేశాయని విమర్శించారు. మహారాష్ట్రలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం రూ.4 వేల కోట్ల గ్రాంట్లు ఇచ్చిందన్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ, మహారాష్ట్రలోనూ అదే పార్టీ అధికారంలో ఉండటంతో సాయం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అందువల్ల 17 ఎంపీ సీట్లూ టీఆర్‌ఎస్ గెలిస్తే కేంద్రం నుంచి అవసరమైన నిధులు సాధించుకోవచ్చన్నారు. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకమన్నారు. అన్ని ఎంపీ సీట్లూ గెలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చన్నారు.
రైతు ఆత్మహత్యలు తగ్గాయి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా తదితర వ్యవసాయ పథకాలతో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 90 శాతం పైగా తగ్గాయని హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు రైతుల పరిస్థితి ఘోరంగా ఉండేదన్నారు. రోజూ పత్రికల్లో రైతు ఆత్మహత్యల సంఖ్యను చూసి బాధపడేవారమన్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉందన్నా రు. దేశం మొత్తం మన పథకాలనే కాపీ కొడుతోం దని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే రైతే సీఎం కావడం వల్లే వ్యవసాయానికి ఆదరణ పెరిగిందన్నారు. ఒకవైపు తమిళనాడు, మరోవైపు మహారాష్ట్ర, ఇంకో వైపు ఢిల్లీలో రైతుల ఉద్యమాలు జరుగుతుంటే, మన రాష్ట్రంలో రైతు సంక్షేమం జరుగుతోందని చెప్పారు.
మండలానికో గోదాం కట్టి ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. తెలంగాణలో చేపడుతున్న రైతు అనుకూల విధానాలను మెచ్చుకొని ప్రముఖ వ్యవసాయ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవార్డు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. స్వామినాథన్‌ను తిట్టిపోసిన ఘనత కాంగ్రెస్ నేతలదని, అందుకే వారికి ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లులు, క్రాప్ కాలనీలు రావాల్సి ఉందన్నారు. బంగారు తెలంగాణకు జీడీపీలు ముఖ్యం కాదని, రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు ఉండటమే నిజమైన అభివృద్ధి అని సీఎం చెప్పారని, అదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులను కోరారు.
దేశం తెలంగాణ వైపు చూస్తుంది: పోచారం
దేశం యావత్తూ తెలంగాణ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్టంలో వ్యవసాయశాఖ ప్రత్యేక స్థానం సంపాదించడంలో కీలక భాగస్వామ్యం వ్యవసాయ శాఖ అధికారులదేనన్నారు. పేదలు, రైతుల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. ఏ రాష్ట్రంలో చేయని పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందన్నారు. రైతు చనిపోతే వారి కుటుంబీకుల ఖాతాల్లో మూడు రోజుల్లో రూ.5 లక్షలు జమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ధాన్యం ఎకరాకు పది బ్యాగులు అదనంగా ఈ ఏడాది వచ్చిందన్నారు.
పదేళ్లలో దేశంలోనే ధనవంతులైన రైతులు తెలంగాణలోనే ఉంటారన్నారు. వచ్చే 15, 20 ఏళ్ల వరకు టీఆర్‌ఎస్, కేసీఆర్ మారరని జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 42 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. రైతు కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని చెప్పారు. వరి నాటు యంత్రాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం చైర్మన్ కృపాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు కరుణాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment