సమీక్షలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట : మొక్కలు చక్కగా నాటి వాటి సంరక్షణ చేసిన గ్రామానికి, విధులు సక్రమంగా నిర్వహించిన అధికారులకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు అందిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో గ్రామాల వారీగా హరితహారం స్థితిగతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అలాగే రెండో బహుమతి కింద రూ.50వేలు, మూడో బహుమతి రూ.25 వేల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పని చేయని వారిపై చర్యలు కూడా శాఖ పక్షాన ఉంటాయని హెచ్చరించారు. మండలాల వారీగా సమీక్షకు హాజరైన వ్యవసాయశాఖ, ఈజీఎస్ అధికారులు, సర్పంచ్‌లు, కార్యదర్శుల హాజరు స్థితిగతులను క్షేత్రస్థాయిలో ఆరా తీశారు.
వచ్చే సమావేశంలో ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని సూచించారు. భవిష్యత్తులో సమీక్షలో ఉపన్యాసాలు ఉండవని కేవలం గ్రామాల వారీగా క్షుణ్ణంగా సమీక్ష నిర్వహిస్తానన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలంటూ సూచిస్తూ మొక్కుబడి సమావేశాలు నిర్వహించకుండా సీరియస్‌గా పని చేసే ఉద్దేశం ఉంటేనే సమీక్షలు నిర్వహిద్దామని లేకపోతే సమయం వృథా చేయడం వద్దంటూ సమీక్ష లక్ష్యం, ఉద్దేశం గూర్చి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వివరించారు.
ఇటీవల సీఎం శాసనసభలో స్పష్టంగా తెలిపిన హరితహారంపై నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యల గూర్చి గుర్తు ఆయన చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి రాదు అనే నమ్మకంతో తాను ఉన్నాడని సమష్టిగా గ్రామాల్లో హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే చర్యలను చేపట్టాలన్నారు. తొలి సమావేశం కావడంతో లక్ష్య సాధనలో వైఫల్యం చెందిన గ్రామాల అధికారులను, ప్రజాప్రతినిధులకు మరొక అవకాశం ఇస్తున్నామన్నారు. సరిగ్గా 30 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని పరిస్థితిలో మార్పు ఉండాలంటూ సూచించారు.
మొక్క నాటిన రైతుకు రాబడి
రైతులు జీవిత కాలం కష్టపడి పంట తీస్తారు. వృద్ధాప్యంలో ఇంటి వద్ద ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగి లాగా ఉద్యోగ విరమణ తర్వాత పెన్ష¯Œన్ ఉండదని కొంచెం అధికారులు రైతులను చైతన్య పరిచి మొక్కలు నాటించడం వలన భవిష్యత్తులో ఒనగూరే ఆదాయం గూర్చి వివరిస్తే మన లక్ష్యం సుగమం అవుతుందంటూ హరీశ్‌రావు అధికారులకు సూచించారు. సమీక్ష అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఒక టేకు మొక్కను శాస్త్రీయంగా సాగు చేయడం వల్ల 50 సంవత్సరాల వయస్సులో ఎకరంలో వంద టేకు మొక్కలు నాటడం వల్ల వాటిలో 70 మొక్కలు బతికినా వాటిని భవిష్యత్తులో విక్రయించడం వల్ల లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని లెక్కలతో వివరించారు. దినసరి ఆదాయం కావాలనుకునే రైతులకు పొలం గట్లపై మునగ, నిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, జామ లాంటి పండ్ల మొక్కలను నాటడం వల్ల వచ్చే ఆదాయం గూర్చి రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటూ సూచించారు.
ప్రతి ఇంటి ముందు ఒక వేపచెట్టు నాటే లక్ష్యంతో సిద్దిపేట నియోజకవర్గంలో హరితహారాన్ని నిర్వహించాలని అదే ప్రధాన అంశంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం సిద్దిపేటఅర్బన్, సిద్దిపేటరూరల్, నారాయణరావుపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల హరితహార లక్ష్యం, ప్రస్తుత స్థితిగతుల నివేదికను ఆధారంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీటీసీలను ఒక్కొక్కరితో మాట్లాడుతూ లక్ష్యం చేరేందుకు చేపడుతున్న చర్యలు, ప్రస్తుతం హరితహారం స్థితిగతులు, గ్రామ ప్రజల భాగస్వామ్యం, రైతుల్లో చైతన్యపరమైన సదస్సుల గూర్చి ఆరా తీస్తూ సలహాలు, సూచనలు అందిస్తూ సమీక్షను నిర్వహించారు.
సమీక్షలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, తుపాకుల ప్రవళ్లిక, కుంబాల లక్ష్మి, ఎంపీపీలు శ్రీదేవి, వంగ సవిత, బాలమల్లు, మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, ఏపీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment