మంత్రి హరీశ్‌రావుకు జ్ఞాపికను ఇస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సాక్షి, పటాన్‌చెరు: అమీన్ పూర్‌కు ఈ రోజు నిజమైన పండుగ రోజని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీరంగూడ– కిష్టారెడ్డిపేట రోడ్డు పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రూ.61 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అమీన్ పూర్‌కు వచ్చినప్పుడు స్థానికులు మంచినీటి సమస్య ఉందని చెప్పారని గుర్తు చేశారు. రెండు వేల ఫీట్ల లోతు వరకు బోరు వేసినా నీరు రాని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.
కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. అమీన్ పూర్‌లోని 67 కాలనీలకు లాభం చేకూర్చే విధంగా నిర్మించిన 30 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను ప్రారంభించామని చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 20 ఏళ్ల వరకు జనాభా పెరిగినా ఇబ్బంది లేని విధంగా మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు నీటి కష్టాలు ఎక్కువగా తెలుస్తాయంటూ అమీన్ పూర్ మహిళలకు నీటి కష్టాలు తప్పుతాయన్నారు.
ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక..
బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రోడ్డు కావాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం కేసీఆర్ పటాన్ చెరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట మీదుగా సుల్తాన్ ఫూర్ వరకు రోడ్డు మాత్రమేనని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పటికే పటాన్ చెరులో అన్ని ప్రధాన రోడ్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిర్మించామని ఆయన తెలిపారు.
అయితే అమీన్ పూర్‌లోని బీరంగూడ కమాన్ నుంచి సుల్తాన్‌పూర్ జంక్షన్ వరకు రూ.49 కోట్లతో రోడ్డు నిర్మాణానికి కేసీఆర్ సూచనలతో కేటీఆర్ మంజూరు చేశారని మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోడ్డు పనులను ప్రారంభించామని, త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పటాన్ చెరులో రోడ్డుపై అంగడి జరిగేదని, ఆ సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యేకు డబుల్ ధమాకా
పటాన్ చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతున్నాయని తెలిపారు. త్వరలోనే పటాన్ చెరులోని పేదలకు ఇళ్లను ఇస్తామన్నారు. పటాన్ చెరు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉందని, దాంతో ఎమ్మెల్యేకు డబుల్ ధమాకాలా రెండు కోటాలు దక్కాయని మంత్రి చమత్కరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి రావాల్సిన డబుల్ బెడ్‌రూంకోటాతోపాటు, జీహెచ్‌ఎంసీ కోటా కింద కూడా ఈ ప్రాంతానికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.
అధికారులకు అభినందనలు
మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్న అధికారులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలోనే ప్రతీ ఇంటికి యావత్ రాష్ట్రంలో నీటిని అందించే కార్యక్రమానికి అధికారులు గొప్పగా సేవలందించారని హరీశ్‌రావు వారిని అభినందించారు. ఇదిలా ఉండగా అమీన్‌పూర్‌లో మండల్ లెవల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను మంత్రి ఆర్డీఓకు అందించారు.
అలాగే అమీన్ పూర్‌లో డంప్ యార్డు ఏర్పాటుకు కూడా మరో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను కమిషనర్ వేమనరెడ్డికి అందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ బీరంగూడ రోడ్డు మంజూరు నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి, దాని పనుల ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌మంజుశ్రీ,, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment