వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు బాబు
జగ్గారెడ్డి తిన్నింటివాసాలు లెక్కించే రకం : హరీశ్‌రావు
మెదక్/పాపన్నపేట: వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే, తరువాత స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డేనని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే కాంగ్రెస్, టీడీపీలు ఓటమిని అంగీకరించాయని, అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్, వెంకయ్యనాయుడులు ప్రచారానికి ఎగ్గొట్టారని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఎర్రబెల్లి సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని సంప్రదించకుండా సీమాంధ్రులతో బీ ఫాం తెచ్చుకున్న జగ్గారెడ్డికి జనం సమాధి కట్టడం ఖాయమన్నారు. జగ్గారెడ్డి తిన్నింటివాసాలు లెక్కించే రకమని ఆరోపించారు. అనంతరం పాపన్నపేట మండలం ఎల్లాపూర్, మల్లంపేట గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్లతో సాగునీరందిస్తామని చెప్పారు. ఎఫ్‌ఎన్, ఎం.ఎన్ కెనాళ్లకు పూర్తిస్థాయి సిమెంట్ లైనింగ్ వేయిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.