‘వన’ రామయ్య | Haritha haram | Sakshi
Sakshi News home page

‘వన’ రామయ్య

Published Sun, Jul 5 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

‘వన’ రామయ్య

‘వన’ రామయ్య

♦ చెట్లే ఆయన ప్రాణం..కోటి మొక్కల పెంపకం
♦ పచ్చని పుడమి కోసం నిత్య ప్రయత్నం
♦ ‘హరితహారమే’ అతని జీవనయానం

 
 వృక్షో రక్షితి రక్షితః అని రాసివున్న గుండ్రని రేకును తలకు కిరీటంలా ధరించి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సంచరించే రామయ్య జిల్లా ప్రజలకు సుపరిచితులే. ‘వనజీవి’ రామయ్య అంటే తెలియని వారుండరేమో..!. ప్రభుత్వం నేడు చేపట్టిన హరితహారం స్ఫూర్తిని ఆయన ఏనాడో పుణికిపుచ్చుకున్నారు. 75 ఏళ్ల వయసులోనూ భార్య జానకమ్మతో కలిసి నిత్యం మొక్కలు నాటుతూ.. ఈ దంపతులు పచ్చని పుడమికోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే కోటికి పైగా మొక్కలు నాటిన ఈ రామయ్యకు కోటి మొక్కులు మొక్కినా తక్కువే... కాబట్టి ‘పచ్చని మొక్కను నాటి..పెంపు చేయడమే..’ ఈ వనజీవికి మనం చేయగలిగిన గొప్ప సన్మానం. ‘హరితవారం’ నేపథ్యంలో సండేస్పెషల్‌గా రామయ్య సేవలను మరోమారు గుర్తుచేసుకుందాం..ఆయన బాటలో సాగుదాం...     - సాక్షి ప్రతినిధి, ఖమ్మం
 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘మొక్కల పెంపకం.. వాటి ప్రాధాన్యం గురించి’ పాఠశాల రోజుల్లో తెలుసుకున్న ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య హరితోద్యమానికి ఆనాడే శ్రీకారం చుట్టారు. 75 ఏళ్ల వయసులోనూ వక్ష రక్షణ కోసం పాటుపడుతున్న ఈ రామయ్య ఇప్పటికే కోటికి పైగా మొక్కలను నాటి పెంచాడు. భార్య జానకమ్మతో కలిసి ‘హరితోద్యమం’ నిర్వహిస్తున్న రామయ్య ఇంటిపేరు దరిపల్లి కాస్త వనజీవిగా మారిపోరుుంది.

 ఎవరీ రామయ్య..?
 ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య చెట్లను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. ఇతని స్వగ్రామం ఇదే మండలంలోని ముత్తగూడెం. పంటపొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో ఇక్కడికి చిన్నప్పుడే వచ్చి స్థిరపడ్డారు. రామయ్యకు భార్య జానకమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నతనం నుంచి కుటుంబ భారాన్ని మోస్తూనే 43 ఏళ్లుగా మొక్కలను పెంచుతున్నారు. ముత్తగూడెం పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు.

ఆ సమయంలోనే ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం- లాభా లు’ అనే పాఠం అతనిలో స్ఫూర్తినింపింది. తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటి వాటిని ప్రాణపదంగా పెం చాడు. అది మొదలు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభు త్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు..ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ము తూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రామయ్య మొక్కలనే బహుమతిగా ఇస్తూ పెంచాలంటాడు.

 వెయ్యికిపైగా సూక్తులు..
 వన రక్షణపై వెయ్యికి పైగా సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర చెక్కాడు. ఏమొక్కను చూపించినా ఆ మొక్క ఉపయోగాన్ని రామయ్య అలవోకగా చెబుతాడు. కెన్యా దేశానికి చెందిన వంగారి మాతాయిని స్ఫూర్తిగా తీసుకుని రామయ్య మూడు కోట్ల మొక్క లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మాతాయి 1970లో గ్రీన్‌బెల్ట్ మూవ్‌మెంట్‌ను స్థాపించి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌ను నడిపిస్తూ మొక్కలు నాటడంపై దృష్టి పెట్టారు. 1986 నుంచి మహిళల హక్కులు, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్‌కై కృషి చేస్తున్నారు. 2004లో రైట్ లైవ్‌హుడ్ అవార్డ్ తీసుకున్నారు. సుస్థిర అభివృద్ధి - ప్రజాస్వామ్యంలో శాం తిని ప్రోత్సహిస్తున్నందుకుగాను నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆమె గురించి వనజీవి రామయ్య విద్యావేత్తల ద్వారా తెలుసుకుని ప్రభావితమయ్యూ రు. రామయ్య 120 రకాల మొక్కల చరిత్రను తేలికగా వివరిస్తారు.

 కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లు
 వనజీవి రామయ్య చెట్లను ఎంతగానో ప్రేమిస్తాడనడానికి నిదర్శనం తన మనుమరాళ్లకు హరిత లావ ణ్య, చందన పుష్ప అని పేర్లు పెట్టడమే. అలాగే తన కుమారుడు సైదయ్య, సత్యనారాయణ, కనకయ్య, కూతురు సైదమ్మ వివాహాల శుభలేఖలపై వృక్షాల గురించిన సమాచారం కూడా ముద్రించి మొక్కలపై తన మక్కువను చాటుకున్నారు. తన సహధర్మచారిణి జానకమ్మ సహా ఎవరికి ఏ రోగమొచ్చినా మొ క్కల ఆకులతోనే వైద్యం చేయటం గమనార్హం.

 ఎన్నో అవార్డులు..
 వనజీవి విశేష కృషికి ఎన్నో సంస్థలు గౌరవ పురస్కారాలు అందించాయి. జిల్లా అటవీశాఖ పర్యావరణ అవార్డును అందజేసింది. 1995లో కేంద్ర ప్రభుత్వం నుంచి సేవా అవార్డును అందుకున్నారు. అలాగే  2005లో సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అందజేసిన వనమిత్ర అవార్డును ఢిల్లీలో మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు చేతుల మీదుగా తీసుకున్నారు.  జిల్లాలో గణతం త్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వనజీవికి ప్రతి ఏటా అవార్డులే. అతని కృషి, పట్టుదలకు ఆకర్షితులైన జిల్లా యంత్రాంగం గతంలో ఒక ద్విచక్రవాహనానంతో పాటు పెట్రోల్ ఖర్చుల కింద రూ.4 వేలు ఇచ్చింది. కాలక్రమంలో ద్విచక్రవాహనం మరమ్మతులకు గురవడంతో తన పాత సైకిల్‌పైనే తిరుగుతున్నారు.

 కోటి మొక్కల ఘనకీర్తి..
 త ను నాటిన కోటి చెట్ల నీడలో రేపటి తరం సుఖంగా ఉండాలన్నదే వనజీవి తపన. ఆయన కంటికి ఎండిన మొక్క కన్పిస్తే నీరు పోయకుండా ముందుకు కదలడు. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు బహుమతులు బదులు మొక్కలను బహూకరిస్తారు. నేటి ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ స్ఫూర్తిని ఏనాడో పుణికిపుచ్చుకున్న రామయ్య స్ఫూర్తితో అందరం ముందుకు సాగుదాం..మొక్కలు, చెట్లను సాకుదాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement